10-03-2025 12:00:00 AM
దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నుంచి వస్తున్న తాజా చిత్రం ‘శారీ’. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రానికి గిరికృష్ణకమల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో మార్చి 21న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యింది.
ప్రస్తుతం సమాజంలోని సంబంధాలపై సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉందనే విషయమై విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఆర్జీవీతోపాటు హీరో సత్య యాదు, కథానాయకి ఆరాధ్యదేవి, నిర్మాత రవిశంకర్‌వర్మ, విజయ హాజరయ్యారు. అధ్యాపకులు, కాలేజీ యాజమాన్య బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రశ్నలకు చిత్రబృందం ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు.
స్టూడెంట్: నన్ను హగ్ చేసుకోవడం ద్వారా మీలోని ధైర్యాన్ని, భయంలేనితనాన్ని సగం ఇస్తారా?
ఆర్జీవీ: -నేను ఇవ్వను! మగవాళ్లను హగ్ చేసుకునే వాడిలా కనిపిస్తున్నానా?!
స్టూడెంట్: పవన్‌కల్యాణ్‌తో సినిమాను డైరెక్ట్ చేస్తారా?
ఆర్జీవీ: -నేను చచ్చాక ఆయనతో డైరెక్ట్ చేస్తాను.
స్టూడెంట్: సందీప్ వంగాతో మీ సినిమా ఆశించవచ్చా?
ఆర్జీవీ: అంటే ఏంటి? నేను హీరోగా.. ఆయన డైరెక్ట్ చేయాలా? లేక ఆయన హీరోగా.. నేను డైరెక్ట్ చేయాలా? ఇద్దరం దర్శకులమే కదా! అదెలా సాధ్యం. కుదరదు.. సినిమా ఉండదు.
స్టూడెంట్: ఇంతమంది దర్శకులుండగా ఆర్జీవీతోనే సినిమా తీశారెందుకు?
నిర్మాత రవిశంకర్‌వర్మ: రామ్ గోపాల్‌వర్మ నా మిత్రుడు. ఆయనతో నా పరిచయం ఉంది కానీ, సినిమా చేస్తాననుకోలేదు. ఓ సందర్భంలో ఈ శారీ కథ గురించి ఆయన నాతో చెప్పారు. ఓ మంచి సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నానని పని మొదలుపెట్టాం. ఈ సినిమాతో నాకు మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నా.
స్టూడెంట్: మీరు ఆర్జీవిని ఎప్పుడైనా కొట్టారా?
విజయ (ఆర్జీవీ సోదరి): చిన్నప్పట్నుంచీ రాము ఆలోచనలు విభిన్నంగా ఉండేవి. చిన్నప్పుడు ఓసారి ఏదో తప్పు చేస్తే కొట్టా. నన్ను తిరిగి కొట్టలేక కాదు, పైగా కరాటే కూడా నేర్చుకున్నాడు. ఎప్పుడూ ఎవరినీ కొట్టే మనస్తత్వం కాదు రామూది. ప్రతీదీ చాలా లైట్‌గా తీసుకుంటాడు.