calender_icon.png 1 November, 2024 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవితో నన్ను కట్టేశారు

07-07-2024 01:49:52 AM

అయినా విమర్శించడంలో తగ్గేదేలే

కేకే రాజీనామా చేస్తే మిగతా వారి పరిస్థితేంటి?

ఫిరాయింపుల్లో బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ అనుసరిస్తోంది

ముఖ్యమంత్రుల భేటీని స్వాగతిస్తున్నా.. 

కేంద్రమంత్రి బండి సంజయ్

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 6 (విజయక్రాంతి): కేంద్రమంత్రి పదవితో తనను కట్టి పడేశారని, అయినా రాజకీ య విమర్శలపై తన దూకుడు తగ్గబోదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ స్పష్టం చేశారు. గతంలో ఇరు రాష్ట్రాల సీఎంలు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టలేదని, కేసీఆర్‌ను రొయ్యల పులుసు, చేపల పులుసు కొంప ముంచిందని ఛలోక్తి విసిరారు. ఇప్పుడు ఇద్దరు సీఎంల భేటీ చక్కని ఫలితాలను ఇస్తుందని, ఈ భేటీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అందు లో ఎలాంటి తప్పు లేదని, రెండు రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరగాలన్నారు.

సీఎంల భేటీ నేపథ్యంలో సెంటిమెంట్ రెచ్చగొట్టి మరో ఉద్యమం చేసి లబ్ధి పొందాలని కొంద రు గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నారని, అలాంటి పరిస్థితి మళ్ళీ రానివ్వొద్దని ఇరువురు సీఎంలకు సూచించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. ఎన్నికలు ఉండవు కాబట్టి రాజ్యసభకు కే కేశవ్‌రావు రాజీనామా చేశారని అన్నారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామాలు చేయడం  లేదని ప్రశ్నించారు. ఫిరాయింపుల్లో బీఆర్‌ఎస్ చేసిందే కాంగ్రెస్ చేస్తోందని, కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వలసలను ప్రోత్సహించేదేలేదని స్పష్టం చేశారు.

అలాగే ఈడీ కేసులు ఉన్నవారిని బీజేపీలో చేర్చుకోబోమన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ మారితే రాజీనామా చేయాలి అని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టారని, అమలు మాత్రం చేయట్లేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సర్కారుకు ప్రజల్లో ఇబ్బందులు తలెత్తినప్పుడల్లా ఎమ్మెల్యేల చేరిక అంశంతో పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే తెలంగాణ ప్రజలు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పారని బండి అన్నారు. 26 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అంటున్నారని, అదే జరిగితే ఆ స్థానాలన్నింటికీ బై ఎలక్షన్ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

ఉప ఎన్నికలు జరిగితే ఆ స్థానాలన్ని బీజేపీ గెలుస్తుందని, అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా తమకే వస్తుందని తెలిపారు. కేంద్రమంత్రులు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఢిల్లీ కార్యాలయంలో ఉండాల్సిందేనని తమకు ఆదేశాలు ఉన్నాయని.. శని, ఆదివారాలు రాష్ట్రానికి వచ్చి స్థానిక సమస్యలపై తమ కార్యాచరణ చేసుకుంటామని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చినట్లుగా ఉద్యోగాలు భర్తీ చేయకుంటే కాంగ్రెస్ మంత్రుల ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారు. 

శేషగిరిరావుతో భేటీ

విశ్రాంత ప్రొఫెసర్ ఎస్వీశేషగిరిరావును బండి సంజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టాక మొదటిసారి శనివారం శేషగిరిరావు ఇంటికి వెళ్లి సంజయ్ ఆశీర్వాదం తీసుకున్నారు. రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన వ్యక్తి శేషగిరిరావు అని కొనియాడారు. ఎంతో దూరదృష్టి కలిగిన వ్యక్తి అని ప్రశంసించారు. ఓయూ ప్రొఫెసర్‌గా, కొచ్చిన్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీగా పని చేశారని గుర్తు చేశారు. అనంతరం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సోదరుడు, ఇటీవల మరణించిన తలసాని శంకర్‌యాదవ్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి బండి నివాళులర్పించారు.

ఎంఐఎంతోనే పోటీ

జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మహిళలు అని కూడా చూడకుండా బీజేపీ కార్పొరేటర్లపై దాడి చేశారని బండి సంజయ్ ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. ఎంఐఎం పార్టీ గోడమీద కూర్చుని, ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో కలుస్తుందని ఎద్దేవా చేశారు. కేవలం హైదరాబాద్‌కే పరిమితమైన ఎంఐఎం నేతలు బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే ఇతర ప్రాంతాల్లో తిరగగలరా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి, ఒవైసీ కుమ్మక్కయ్యారని, ఆర్థిక లావాదేవీల కోసమే వాళ్ళు కలుస్తారని విమర్శించారు.

పాతబస్తీ సమస్యల పరిష్కారం కోసం ఎంఐఎం నేతలు సీఎంలను ఏనాడు కలవలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో శ్రీధర్‌రెడ్డి అనే బీఆర్‌ఎస్ నాయకున్ని హత్య చేసి 50 రోజులు దాటినా పోలీసులు ఒక్కరినీ అరెస్టు చేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని బండి సూచించారు. దీనిపై వెంటనే సంబంధిత ఐజీకి ఫోన్ చేసినట్లు తెలిపారు. తక్షణమే నిందితులను అరెస్టు చేయాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.