04-04-2025 12:00:00 AM
హీరో సిద్ధు జొన్నలగడ్డ తాజాచిత్రం ‘జాక్ కొంచెం క్రాక్’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో శ్రీవేంకటేశ్వర సినీచిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సిద్దు సరసన వైష్ణవిచైతన్య హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. గురు వారం ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో కథానాయకుడు సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. “బొమ్మరిల్లు భాస్కర్ ‘జాక్’ కథను చెప్పినపుడే చాలా ఉత్తేజానికి గురయ్యాను.
ఇది చాలా పెద్ద కథ. పైకి కనిపించేది కాదు.. లోపల చాలా ఉంటుంది. భాస్కర్ జానర్ మార్చడం వల్ల ‘జాక్’ చాలా కొత్తగా అనిపిస్తుంది. ‘డీజేటిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ కారెక్టరైజేషన్ ఏ మీటర్‌లో ఉంటుందో.. ‘జాక్’ అంతకు మించి ఉంటుంది. టిల్లు కారెక్టర్ బేస్డ్ సినిమా అయితే.. ‘జాక్’లో కారెక్టర్‌తోపాటు అదిరిపోయే కథ ఉంటుంది. ఇంటర్వెల్‌లో వచ్చే ఛార్మినార్ ఎపిసోడ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఉంటుంది.
సినిమా చాలా రేసీగా ఉంటుంది” అన్నారు. హీరోయిన్ వైష్ణవిచైతన్య మాట్లాడుతూ.. “చిన్నప్పుడు ‘బొమ్మరిల్లు భాస్కర్ పాటలకు మైమర్చిపోతుండేదాన్ని. అలాంటి స్థాయి నుంచి ఇప్పుడు ఆయన పాటల్లో కనిపించడమే నా సక్సెస్‌గా భావిస్తున్నా.. ఆయన దర్శకత్వంలో నటించడం నా అదృష్టం. సిద్దు సెట్స్‌లో సన్నివేశాలను మెరుగుపర్చే చేసే తీరు చూసి భయపడేదాణ్ని.
సిద్దు లాంటి గొప్ప నటుడితో పనిచేయడం ఆనందంగా ఉంది” అని చెప్పింది. డైరెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ.. “సిద్దు లాంటి నటుడితో పనిచేయడం ఏ దర్శకుడికైనా చాలా సులభం. సిద్దుని నమ్మి సీన్ చెప్పి కళ్లు మూసుకుంటే చాలు. ఆ సన్నివేశం అద్భుతంగా వస్తుంది. ప్రతిఒక్కరిలో జాక్ ఉంటాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ను నమ్మి వచ్చే కుటుంబ ప్రేక్షకులను నేను నిరాశపర్చను.
పైన సిద్దు ఫ్లేవర్ కనిపించినా లోలోపల నాదైన శైలిలో భావోద్వేగాలు, సందేశాలన్నీ ఉంటాయి” అని తెలిపారు. నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘భాస్కర్‌తో మాకు ఎప్పట్నుంచో పరిచయం. ఆయన దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది’ అన్నారు.