కథానాయిక సాయిపల్లవి ఇటీవలి కాలంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే ‘అమరన్’ చిత్రంతో మంచి విజయం సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి తన సినిమాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రం షూటింగ్ సమయంలో తాను పడిన ఇబ్బందిని వివరించారు. “శ్యామ్ సింగరాయ్’ చిత్రీకరణ సమయంలో నేను నటించిన సన్నివేశాలన్నీ రాత్రి వేళలోనే చిత్రీకరించారు.
రాత్రి నేను నిద్రకు ఆగలేను. పగలు నిద్ర రాదు. దీంతో ప్రతిరోజూ నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. నా పరిస్థితి దారుణంగా ఉండేది. ఒకటి రెండు రోజులు అయితే పర్వాలేదు కానీ నెలంతా రాత్రి సమయంలోనే చిత్రీకరణ ఉండేది. ఆ నెల రోజుల పాటు నా పరిస్థితి ఇదే. మరోవైపు ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు అంగీకరించిన సినిమాల షూటింగ్స్‌కు ఉదయం వెళ్లాల్సి వచ్చింది.
విశ్రాంతి లేకుండా పని చేయడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాను. ఒకరోజు నన్ను చూసేందుకు మూవీ సెట్‌కి నా సోదరి పూజా కన్నన్ వచ్చింది. ఆమెతో మాట్లాడుతూ ఏడ్చేశా. ఒప్పుకున్న చిత్రాలు చేయాలి కానీ విశ్రాంతి దొరికితే బాగుంటుంది’ అని నా ఆవేదనంతా చెప్పుకున్నా. దీంతో నా చెల్లి నేరుగా ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ నిర్మాత వెంకట్ బోయినపల్లి దగ్గరకు వెళ్లి ‘ఒక్కరోజైనా సెలవు ఇవ్వండి.
మా అక్క ఏడుస్తోంది’ అని చెప్పింది. అప్పుడు వెంకట్ నన్ను పిలిచి ‘ఒక్క రోజు కాదు.. పది రోజుల పాటు సెలవు తీసుకుని అంతా బాగుందనుకున్నప్పుడే షూటింగ్‌కి రా” అని చెప్పారని సాయి పల్లవి తెలిపారు. అప్పుడు చాలా రిలాక్స్ అయిపోయానని వెల్లడించారు. ప్రస్తుతం సాయి పల్లవి ‘తండేల్’, బాలీవుడ్‌లో ‘రామాయణ’ చిత్రాల్లో నటిస్తున్నారు.