24-02-2025 01:04:11 AM
రాజేంద్రనగర్, ఫిబ్రవరి23(విజయక్రాంతి): దేవుడి భూములు మాయమవుతు న్నాయి. ఎండోమెంట్ భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పరిరక్షించవలసిన ఆ శాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి.
అప్పుడప్పుడు కూల్చివేతలు చేస్తూ హడావిడి సృష్టిస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో ఏమాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖకు సంబంధించిన భూము లు కొందరు దర్జాగా నిర్మాణాలు చేపడుతు న్న అడిగే నాథుడు కరువయ్యారు.
ఆక్రమణదారులు ఏంచక్క మూడు నాలుగు అంత స్తులు నిర్మించుకుంటున్నా అటువైపు దేవాదాయ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లే దని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొన్నిచోట్లనే కూల్చివేతలు
దేవాదాయ శాఖకు సంబంధించిన అన్ని భూములను పరిరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పక్షపాతంగా వ్యవహరిస్తూ ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిర్మాణదారులకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతోపాటు ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతూ వారి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఎప్పటికప్పుడు దృష్టి సారించాల్సిన ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడంలేదని చెబుతున్నారు.
రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ లోని పలు దేవాలయాలకి సంబంధించిన భూముల్లో క్షేత్రస్థాయిలో అక్రమ నిర్మా ణాలు దర్జాగా వెళుతున్నాయి. ఈ విషయం ఎండోమెంట్ శాఖ అధికారులకు తెలిసిన కూడా పట్టించుకోవడంలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమణదారులకు అన్ని విధాలుగా వారు సహకరిస్తుండటంతో నిర్మాణాలు పూర్తవుతున్నాయి.
అత్తాపూర్ లోని వివిధ ప్రాంతాల్లో సీతారామ చంద్ర స్వామి దేవాలయం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం అదేవిధంగా భవాని మాత దేవాలయాలకు సంబంధించి వందలాది ఎకరాల భూములు ఉన్నాయి. వాటిని ఎండోమెంట్ అధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఆక్రమణదారుల నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది.
రెచ్చిపోతున్న కబ్జాదారులు
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను ఆక్రమించుకునేందుకు కబ్జాదారులు కొమ్ముకాచుకొని కూర్చున్నారు. సంబంధిత శాఖ అధికారులు కూడా మెతక వైఖరి అవలంబిస్తుండటంతో దర్జాగా రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కొన్ని రోజుల క్రితం అధికారుల నిర్లక్ష్యం కారణంగా అత్తాపూర్ ప్రధాన రహదారికి సమీపంలో అందరూ ఆక్రమణదారులు దర్జాగా ఎండోమెంట్ భూమికి ప్రహరీ నిర్మించడం గమనారం. దానిని తర్వాత అధికారులు కూల్చివేశారు. దీంతోపాటు అత్తాపూర్ డిజన్ పరిధిలోని జనప్రియ అపార్ట్ మెంట్స్ సమీపంలో కొన్నేళ్ల క్రితం ఆక్రమణదారులు సుమారు నాలుగు ఎకరాల పాదాయ శాఖకు సంబంధించిన ఆక్రమించుకొని వ్యాపారాలు కూడా కొనసాగించారు.
సదరు భూమిని కొన్ని రోజుల క్రితం దేవాదాయ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే భూమి చుట్టూ ప్రహరీ నిర్మించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు సర్వే చేయడం లేదని సాకులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి దేవాదాయ శాఖ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను సత్వరమే కూల్చివేయాల్సిన అవసరం ఉంది.
నోటీసులు జారీ చేశాం
ఇప్పటికే అక్రమార్కులకు నోటీసులు జారీ చేశాం. పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించాం. దేవాదాయ భూములను పరిరక్షించేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఇటీవల జన చైతన్య అపార్ట్మెంట్ సమీపంలో స్వాధీనం చేసుకున్న సుమారు నాలుగు ఎకరాల భూమిని సర్వే చేయించి ఎండోమెంట్ శాఖ ఉన్నతాధికారాల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.
అంజయ్య, ఎండోమెంట్ ఈఓ