calender_icon.png 20 October, 2024 | 9:24 AM

నా ప్రాణాలను పణంగా పెడతా

20-10-2024 02:13:09 AM

పేదల ఇళ్లను మాత్రం కూల్చనివ్వను

మూసీ సుందరీకరణపై సీఎం పునరాలోచించాలి

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కార్వాన్ నియోజకవర్గంలో మూసీ బాధితులకు భరోసా 

కార్వాన్, అక్టోబర్ 19:  ‘నా ప్రాణాలను పణంగానైనా పెడతాను కానీ మూసీ బాధితుల ఇళ్లను కూల్చనివ్వను.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధం’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తాను పేదల కోసం నెల రోజుల పాటు మూసీ ప్రాం తంలో ఉండటానికి కూడా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. శనివారం కార్వాన్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. మూసీ బాధితులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మొదట లంగర్ హౌస్ డివిజన్ పరిధిలోని రాందేవ్‌గూడ, పద్మానగర్‌లో మూసీ బాధితులతో మాట్లాడిన కిషన్‌రెడ్డి, అనంతరం డిఫెన్స్ కాలనీ, జియాగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇళ్లు కూల్చడమా అని ప్రభుత్వంపై మండిపడ్డారు.

సీఎం రేవంత్‌రెడ్డి మూసీ నదికి ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించి సుందరీకరణ చేస్తే సరిపోతుందని సూచించారు. గతంలో నిజాం కూడా మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టారని గుర్తుచేశారు. మూసీ నదిలో పలు ప్రాంతాల నుంచి డ్రైనేజీ వచ్చి కలుస్తోందని, డ్రైనేజీని డైవర్షన్ చేయకుండా ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ఉపయోగం ఉండదని హితవు పలికారు. మూసీ నది సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, అయితే పేదల ఇళ్లు కూల్చివేసి అభివృద్ధి చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇక్కడ ఇళ్లను కూల్చివేసి ఎక్కడో హయత్‌నగర్, ఇతర ప్రాంతాల్లో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. మూసీ సుందరీకర ణపై సర్కారు, సీఎం రేవంత్ పునరాలోచించాలని తెలిపారు.

గతంలో కేసీఆర్ హుస్సేన్ సాగర్‌ను ప్రక్షాళన చేసి అందులోని నీళ్లను కొబ్బరినీళ్ల మాదిరిగా మారుస్తానని చెప్పి ఇప్పుడు ఫాంహౌస్‌లో పడుకున్నాడని, అదే గతి రేవంత్‌రెడ్డికి కూడా పడుతుందని ధ్వజమెత్తారు. బీజేపీ పేదలకు అన్నివిధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ నెల 25న మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్కు వద్ద భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నామని, బాధితులతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. 

మమ్మల్ని చంపాకే ఇళ్ల జోలికి రావాలి

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఎదుట బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నారు. మాకు మీరే న్యాయం చేయాలని వేడుకున్నారు. తాము 30, 40 ఏళ్లుగా రూపాయి రూపాయి పోగేసి ఇక్కడ ఇళ్లను కట్టుకొని ఉంటున్నామని.. ప్రభుత్వానికి ఆస్తి పన్ను, కరెంట్ బిల్లులు సహా ఇతర అన్ని బిల్లులను చెల్లిస్తున్నామని తెలిపారు. సర్కారు కొత్తగా ఇళ్లను ఇవ్వకపోగా ఉన్న ఇళ్లను కూల్చివేస్తోందని కన్నీటి పర్యంతమయ్యారు. తమకు మూసీ నుంచి దుర్వాసన వస్తోందని ముఖ్యమంత్రికి కానీ, కాంగ్రెస్ నేతలకు కానీ ఫిర్యాదు చేయలేదని, మరి ఎందుకు సీఎం మూసీ సుందరీకరణ పనులకు పూనుకున్నారని ప్రశ్నించారు.

మూసీ నదిలో ఏమైనా చేసుకోండి కానీ బఫర్‌జోన్‌లో ఉన్న తమ ఇళ్ల జోలికి రావొద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మమ్మల్ని చంపేసిన తర్వాతే ఇళ్ల జోలికి రావాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అమర్‌సింగ్, హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ అల్వాల ఇంద్రసేనారెడ్డి, ఉదయ్‌కుమార్, నాగేంద్రప్రకాశ్‌రెడ్డి, బాలాప్రసాద్ తివారి, పూర్ణచందర్, జెన్న సుధాకర్ పాల్గొన్నారు.