20-04-2025 12:51:22 AM
సిద్దిపేట, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): సిద్దిపేటలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ అనే అంశంపై శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరయ్యారు.
అయితే సాత్విక అనే విద్యార్థిని మాట్లాడుతూ.. తాను రెండవ తరగతిలో ఉన్నప్పుడు తన తండ్రి రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయాడని, తాను తన తల్లిని చాలా ఇబ్బంది పెట్టానంటూ ఏడుస్తూ చెప్పింది. దీంతో వేదికపై ఉన్న హరీశ్‌రావు సైతం కంటతడి పెట్టారు. బాలికను దగ్గరికి తీసుకుని ఓదార్చి, మీ కుటుంబానికి అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పి తన పక్కాన కుర్చోబెట్టుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. “సాత్విక మాటలు వింటే నాకు మా అమ్మ గుర్తుకువచ్చింది” అని చెప్పారు. తల్లిదండ్రుల త్యాగాన్ని వెలకట్టలేమన్నారు. ఏ స్థాయిలో స్థిరపడినా తల్లిదండ్రులను, గురువులను గౌరవించాలని సూచించారు.