* రూ. 35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 4(విజయక్రాంతి) : తాను పని చేసే ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటన కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఆదేశ్ గుప్తా కార్పెంటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కార్ఖానా పరిధిలోని సుందరం అనే వ్యక్తి ఇంట్లో కార్పెంటర్ పనికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే ఇంట్లో పని చేసే సందర్భంలో ఆదేశ్‌కు అల్మారా తాళం దొరికింది. ఇంట్లో ఎవరు లేని సమయంలో అల్మారాను తెరిచిన ఆదేశ్ విలువైన బంగారు ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదేశ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 9 జతల బంగారు గాజులు, 16 బంగారు చైన్లు, రెండు ఉంగరాలు, రూ. 99 వేల నగదు.. మొత్తంగా రూ. 35 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు నార్త్ జోన్ డీసీపీ ఎస్. రశ్మీ పెరుమాల్ తెలిపారు.