calender_icon.png 25 November, 2024 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్‌సీసీలోనే క్రమశిక్షణ నేర్చుకున్నా

25-11-2024 03:09:42 AM

  1. ఎన్‌సీసీ డే సందర్భంగా విద్యార్థి రోజులు గుర్తుకువచ్చాయి
  2. హైదరాబాద్‌కు చెందిన ఫుడ్ ఫర్ థాట్ సంస్థ కృషి అభినందనీయం
  3. మన్‌కీబాత్‌లో ప్రధాని నరేంద్రమోదీ

న్యూఢిల్లీ, నవంబర్ 24: ఎన్సీసీ క్యాడెట్‌గా పనిచేయడం వల్లనే తన జీవితంలో క్రమశిక్షణ అలవడిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఎన్సీసీ యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాతత్వాన్ని పెంపొందించడంలో సహకరిస్తుందని తెలిపారు.

ఆదివారం 116వ మన్ కీ బాత్ ఎపిసోడ్‌లో మాట్లాడిన మోదీ.. ఎన్‌సీసీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన క్యాడెట్ ఉన్ననాటి అనుభవాలను ప్రధాని గుర్తుచేసుకున్నారు. ఎన్‌సీసీ అని వినగానే అందరికీ కాలేజీ జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి.

నేను కూడా ఎన్సీసీ క్యాడెట్ ఉన్నా. అప్పుడు ఎన్నో అంశాలు నేర్చుకున్నానని పూర్తి విశ్వాసంతో చెప్తున్నా. అక్కడి నుంచే నేను క్రమశిక్షణ నేర్చుకున్నా అని వివరించారు. 

ప్రత్యేకంగా వివేకానంద జయంతి

స్వామి వివేకానంద జయంతిని ఏటా జనవరి 12 ‘యువజన దినోత్సవం’ పేరుతో భారత్ జరుపుకుంటున్న విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావించారు. వచ్చే ఏడాది వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకుని జనవరి 11 ఢీల్లీలోని భారత్ మండపంలో యవకుల ఆలోచనల కుంభమేళ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని ‘వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్’గా నామకరణం చేశారు.

విదేశాల్లో భారతీయుల ముద్ర

మన్‌కీబాత్‌లో తన గయానా పర్యటన గురించిన ప్రస్తావించిన మోదీ.. అక్కడ ఒక మినీ భారత్ ఉందని అన్నారు. బ్రిటీష్ కాలంలో ఎంతోమందిని కూలీలుగా అక్కడి తీసుకెళ్లారు. ఇప్పుడు వారి వారసులు విద్య, రాజకీయాలు, సంస్కృతి, వ్యాపారం ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటుతున్నారని చెప్పారు. గయానా అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్ అలీ కూడా భారత సంతతి వ్యక్తేనని తెలిపారు. 

ఫుడ్ ఫర్ థాట్‌పై ప్రధాని ప్రశంసలు

హైదరాబాద్ వేదికగా పని చేస్తోన్న ‘ఫుడ్ ఫర్ థాట్’ ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా గ్రంథాలయాలను నెలకొల్పుతూ పుస్తకాలు చదివేలా ప్రజలను ప్రోత్సహిస్తోందని కొనియాడారు. చదువుకు అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా ఈ ఫౌండేషన్ కల్పిస్తోందన్నారు. మన్ కీ బాత్ ప్రసంగంలో ప్రధాని ‘ఫుడ్ ఫర్ థాట్’ ఫౌండేషన్ ప్రస్తావించడంపట్ల ఆ సంస్థ వ్యవస్థాపకులు కే శ్రీనివాస్‌రావు సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలిపారు.