ఫార్ములా ఈ-రేసు కేసు
ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదు
నగదు బదిలీ గురించి అధికారులకే తెలుసు
- 7గంటల పాటు ఈడీ విచారణలో కేటీఆర్
- ఫెమా, మనీ లాండరింగ్‌పై ప్రశ్నల వర్షం
హైదరాబాద్, జనవరి 16 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-కార్ రేసులో గ్రీన్‌కో కంపెనీకి రూ. 45.7 కోట్ల చెల్లించాలని హెచ్‌ఎండీఏ శాఖకు తాను ఆదేశాలు మాత్రమే ఇచ్చానని, అయితే ఈ నగదు బదిలీ ఎలా జరిగిందనేది తనకు తెలియదని, ఆ విషయం అధికారులకే తెలుసునని ఎన్‌ఫోర్స్‌మెం ట్ డైరెక్టరేట్ (ఈడీ)కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పినట్లు తెలిసింది.
ఈ కేసు విచారణలో భాగంగా గురువారం కేటీఆర్‌ను బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసులో అధికారులు 7 గంటల పాటు విచారించా రు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈసీఆర్‌ను నమోదు చేసింది. ఈ సందర్భంగా కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో ఇప్పటికే ఏ2 అర్వింద్‌కుమార్, ఏ3 బీఎన్‌ఎల్ రెడ్డి ని విచారించిన ఈడీ.. వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నించింది.
ఈ కేసులో ఇప్పటికే ఏసీబీ కేటీఆర్‌ను విచారించింది. ఏసీబీ మాదిరిగా విస్తృతమైన ప్రశ్నలు కాకుండా, ఫారెన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) నిబంధనల ఉల్లంఘన, నగదు బదిలీ, మనీ లాండరింగ్ అంశాల చుట్టూనే ఈడీ ప్రశ్నలు ఉన్నట్లు తెలిసింది.
ఫెమా నిబంధనలకు విరుద్ధంగా నిధులను ఎందుకు బదిలీ చేశారు? ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు? అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? నగదు బదిలీ చేయమని చెప్పింది మీరేనా? హిమాయత్ నగర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చి నగదును పౌండ్లలోకి మార్చి పంపారా? నిబంధనలను పాటించకుండా రూ.45.7 కోట్లను పౌండ్లలోకి మార్చడం నేరమని తెలియదా? తొలి సీజన్ విజయవంతంగా ముగిసినా..
ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ ఒప్పందం నుంచి తప్పుకోవడానికి కారణాలు ఏమిటీ? అంటూ ఒప్పందం కుదిరిన మొదలు హెచ్‌ఎండీఏ నుంచి రూ.45.7కోట్లు బదిలీ వరకు జరిగిన ఉదంతాలపై ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. ఇలాఉండగా, ఈ మొదటి ప్రోమోటర్ అయిన ఏస్ నెక్ట్స్ జెన్‌కు ఏసీబీ గురువారం నోటీసులు జారీచేసింది. శనివారం విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొంది. ఫార్ములా ఈ-రేసు ఒప్పందంపై ప్రధానంగా ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించనుంది.
అవును లేదా కాదు.. ఎక్కువ సమాధానాలు ఇవే..
రాష్ట్ర దర్యాప్తు సంస్థలకు భిన్నంగా ఈడీ విచారణ సాగింది. ఇది వరకే కేసులో ఏ2, ఏ3లను విచారించింది. అలాగే, ఏసీబీ నుంచి కూడా వివరాలను తెప్పించుకొని.. దాదాపు 40పైకి పైగా ప్రశ్నావళిని ఈడీ తయారు చేసుకుంది. అందులో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఎస్ లేదా నో మాత్రమే చెప్పాలని కేటీఆర్‌ను అడిగినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు మాత్రమే కేటీఆర్‌కు వివరించి చెప్పుకునే అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
ఒప్పందం ఆలోచన ఎవరిది?
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేసు నిర్వహిచేందుకు ఎంఏయూడీ, ఫార్ములా ఈ ఆపరేషన్స్, గ్రీన్‌కో కంపెనీల మధ్య 2022లో త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. అసలు ఈ ఒప్పందం ఆలోచన ఎవరిదని కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించింది. పెట్టుబడులను ఆకర్షించేందుకు తాను ఈ ఒప్పందాన్ని ప్రదిపాదించినట్లు కేటీఆర్ సమాధానం చెప్పినట్లు తెలిసింది.
నగదు చెల్లించమని హెచ్‌ఎండీఏను మీరే ఆదేశించారా? అని కేటీఆర్‌ను అధికారులు ప్రశ్నించగా.. అవును అని ఆయన సమాధానం చెప్పినట్లు సమాచారం. అయితే అధికారులు ఎలా చెల్లింపులు చేశారో తనకు తెలియదన్నట్లు కేటీఆర్ చెప్పడం గమనార్హం. ఈ విషయంలో కేటీఆర్ చెప్పిన సమాధానాన్ని ఈడీ అధికారులు అంగీకరించలేదని తెలుస్తోంది.
కేటీఆర్ బ్యాంకు అకౌంట్లను పరిశీలించిన ఈడీ
విచారణ సందర్భంగా కేటీఆర్ బ్యాంకు అకౌంట్లను ఈడీ పరిశీలించింది. గ్రీన్‌కో కంపెనీకి రూ.45 కోట్లను పంపిన తర్వాత.. ఆ నిధులు ఎక్కడి వెళ్లాయి? ఇండియాకు తిరిగి ఏమైనా బదిలీ అయ్యాయా? అనే కోణంలో ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. గ్రీన్‌కో కంపెనీ నుంచి బీఆర్‌ఎస్‌కు బాండ్ల రూపంలో వచ్చిన విరాళంపై కూడా ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే కేటీఆర్ బ్యాంకు అకౌంట్లతో పాటు ఆస్తు వివరాలను కూడా ఈడీ అడిగినట్లు సమాచారం.
ఏస్ నెక్ట్స్ జెన్‌కు ఏసీబీ నోటీసులు
ఫార్ములా ఈ రేసు కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో ఏ1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఏ2 అర్వింద్‌కుమార్, ఏ3 బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించిన దర్యాప్తు సంస్థ.. మరిన్ని విషయాలను రాబట్టేందుకు మలివిడత విచారణకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే ఫార్ములా ఈ మొదటి ప్రోమోటర్ అయిన ఏస్ నెక్ట్స్ జెన్‌కు నోటీసులు జారీ చేసింది. శనివారం విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో ఏసీబీ పేర్కొంది. ఫార్ములా ఈ-రేసు ఒప్పందంపై ప్రధానంగా ఏస్ నెక్ట్స్ జెన్ ప్రతినిధులను ఏసీబీ ప్రశ్నించనుంది.
వాస్తవానికి నాలుగు సీజన్లు నిర్వహించేందుకు తెలంగాణ ఎంఏయూడీతో ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. కానీ ఒక సీజన్ నిర్వహించిన అనంతరం ఒప్పందం నుంచి తప్పుకుంది. ఈ ఒప్పందం నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది? నష్టం వల్లే వైదొలగాల్సి వచ్చిందా? లేక మరో కోణం ఏమైనా ఉందా? అనే కోణాల్లో ఏసీబీ ప్రశ్నించనుంది. హైదరాబాద్‌లో 9,10,11,12 ఫార్ములా ఈ-కార్ రేస్ సీజన్లను నిర్వహించేందుకు 2022 అక్టోబర్‌లో ఏస్ నెక్ట్స్ జెన్ ఒప్పందం చేసుకుంది.
ఒప్పందం ప్రకారం రేసుకయ్యే ఖర్చును ఆ సంస్థ భరించాల్సి ఉంటుంది. అనుకున్న విధంగానే 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో 9వ సీజన్‌ను నిర్వహించింది. అయితే 2024లో నిర్వహించాల్సిన 10 సీజన్‌కు ఏస్ నెక్ట్స్ జెన్ రూ.90కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ తాను చెల్లించబోనని, తమకు నష్టం వచ్చిందని, అందుకే ఒప్పందం నుంచి తప్పుకున్నట్లు పేర్కొంది.
ఈ క్రమంలో రంగంలోకి దిగిన అప్పటి ఎంఏయూడీ మంత్రి కేటీఆర్.. హెచ్‌ఎండీఏను ప్రమోటర్‌గా ఉండి.. రూ.45.71 కోట్లను చెల్లించాలని ఆదేశించారు. అప్పుడు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో ఇప్పుడు ఏసీబీ, ఈడీ కేసులు నమోదు చేశారు.
సాంకేతిక తప్పిదాలు తప్ప.. రూపాయి అవినీతి లేదు
ఆర్‌బీఐ అనుమతి లేకుండా ఫెమా నిబంధనలను ఉల్లంఘించి, ఓవర్సీస్ బ్యాంకును మేనేజ్ చేసి రూ.45 కోట్లను పౌండ్ల రూపంలో పంపించడం నేరమని మీకు తెలియదా? అని కేటీఆర్‌ను ఈడీ ప్రశ్నించింది. నగదు బదిలీలో సాంకేతిక తప్పులు జరిగాయి తప్పితే.. అందులో రూపాయి అవినీతి జరగలేదని కేటీఆర్ సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఇదొక రాజకీయ కేసుగా ఈడీ అధాకారులకు చెప్పినట్లు సమాచారం. నింబధనలను ఉల్లంఘించడం తప్పుకాదా? అని ఈడీ ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఏసీబీకి చెప్పినట్లే ఈడీకి కూడా పెట్టుబడుల కోసమే అలా చేసినట్లు కేటీఆర్ చెప్పినట్లు సమాచారం.
ఏడు గంటల విచారణ.. రెండో నోటీసు
కేటీఆర్‌ను ఈడీ దాదాపు 7 గంటల పాటు విచారించింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈడీ విచారణ సాయంత్రం 5.30 గంటల వరకు సాగింది. మధ్యాహ్నం గంట పాటు కేటీఆర్‌కు భోజన విరామం ఇచ్చారు. అలాగే, ఈడీ ఆఫీస్‌కు వచ్చిన అర గంట పాటు కేటీఆర్ ఈడీ ఫార్మాలిటీలను పూర్తి చేశారు. అంటే టెక్నికల్‌గా కేటీఆర్‌ను ఈడీ విచారించింది 5.30గంటల మాత్రమే. ఇదిలా ఉండగా.. వాస్తవానికి కేటీఆర్ ఈ నెల 7వ తేదీన ఈ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే అదే రోజున ఏసీబీ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఉన్న నేపథ్యంలో కేటీఆర్ విచారణకు రాలేదు. దీంతో 16వ తేదీన విచారణకు రావాలని ఈడీ మరో నోటీసు పంపింది.