నటనపై ఆసక్తి ఉండటంతో మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది కేరళ కుట్టి ప్రిశా రాజేశ్ సింగ్. మోడలింగ్ రంగంలో సాధించిన అనుభవం, పేరు ప్రతిష్టలే తన కలల రంగమైన సినీ పరిశ్రమలోకి తీసుకొచ్చాయి ఆమెను. నిఖిల్ ‘స్పై’తో తెలుగు ప్రేక్షకుల ముంగిట్లోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. ‘స్పై’లో ప్రత్యేక పాత్రలో కనిపించిన ఈ అమ్మడికి ఆ సినిమాతో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ‘స్పై’ చిత్రీకరణలో ఉండగానే ప్రిశాను మరో సినిమా అవకాశం పలుకరించింది. అదే అల్లు శిరీష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘బడ్డీ’ సినిమా. అంటే, ‘బడ్డీ’తో మరోమారు తెలుగు తెరపై మెరవనుందన్న మాట ఈ భల్లే భల్లే బ్యూటీ.
సిక్కు పరివారంలో పుట్టి పెరిగిన ఈ పడుచు అందం మాతృభాష కన్నడలోనే కాక పంజాబీ, ఇంగ్లిష్ భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడగలదు. తమిళ చిత్రం ‘టెడ్డీ’కి రీమేక్‌గా రూపొందుతున్న ‘బడ్డీ’లో నటిస్తున్నప్పుడే తెలుగు కూడా నేర్చుకుందీ సొగసరి. ‘బడ్డీ’లో ప్రిశా.. ఎయిర్ హోస్టెస్‌గా కనిపించనుంది. ఆ పాత్ర కోసం ఎయిర్ హోస్టెస్‌ల నడవడిక, పనితీరు, బాడీ లాంగ్వేజ్‌ని దగ్గరుండి మరీ చూసి హోమ్‌వర్క్ చేసింది ప్రిశా. ప్రకృతిలో గడిపేందుకు ఇష్టపడే ప్రిశా తరచూ బీచ్‌లకు వెళ్తుంది. అడవుల్లో విహరించడమూ మహా సరదా ఈమెకు. ఫొటోషూట్లలో పాల్గొంటూ గ్లామరస్ ఫోజులను అప్‌లోడ్ చేస్తూ ఇన్‌స్టాలో రెండున్నర లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది.