calender_icon.png 25 October, 2024 | 5:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైఎస్ లాంటి నేతను చూడలేదు

09-07-2024 02:20:53 AM

సంక్షేమం, అభివృద్ధి అంటేనే ఆయనే గుర్తుకొస్తారు

రాహుల్‌ని ప్రధాని చేయడమే సంకల్పంగా పనిచేశారు

పీసీసీ చీఫ్‌గా మూడేళ్లు ఒడిదుడుకులు ఎదుర్కొన్నా 

వైఎస్సార్ జయంతిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి) : తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి లాంటి గొప్ప మనిషిని చూడలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రజలు కోరుకున్న పాలనను వైఎస్సార్ అందించారని, అందుకే ఇన్నేళ్లయినా ప్రజలు గుండెల్లో నిలిచిపోయారని చెప్పారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా పార్టీ కోసం పని చేసిన 35 మంది నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినట్టు తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలనే స్ఫూర్తి వైఎస్సార్ ఇచ్చారని పేర్కొన్నారు.

వైఎస్సార్ 78వ జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాసు మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు సోమవారం పంజాగుట్టలోని ఆయన విగ్రహానికి, ప్రజాభవన్, గాంధీభవన్, సీఎల్పీ కార్యాలయంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజాభవన్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేశంలో సంక్షేమం అంటే వైఎస్సార్ గుర్తుకొస్తారని తెలిపారు. వైఎస్సార్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో రాహుల్‌గాంధీని ప్రధాని చేయడం తన లక్ష్యమని చెప్పారని సీఎం గుర్తుచేసుకున్నారు. కాలం కాటు వేసిందో.. దురదృష్టం వెంటాడిందో రాహుల్ ప్రధాని కాకముందే వైఎస్సార్ చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. మూడేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా తాను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని చెప్పారు. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటానని స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం భట్టి చెప్పినట్టు గతంలో పార్టీ నుంచి వెళ్లిన వారు తిరిగి రావాలని కోరారు.   

నిజమైన వైఎస్సార్ వారసులు వారే.. 

రాహుల్‌గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాణిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రధాని పదవికి ఆయన ఒక్క అడుగు దూరంలో ఉన్నారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం వైఎస్సార్ ఆశయమని పునరుద్ఘాటించారు. రాహుల్‌ను ప్రధానిగా చేయడానికి ఎవరు అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్సార్ వారసులని, వ్యతిరేకంగా అడుగులు వేస్తే వైఎస్సార్ వ్యతిరేకులని చెప్పారు. మూసీ ప్రక్షాళన చేయాలనే ఆలోచన వైఎస్సార్ స్ఫూర్తితోనే ప్రభుత్వం చేపట్టిందని గుర్తుచేశారు. వైఎస్సార్ పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారని మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు చెప్పారు. వైఎస్ చేపట్టిన పాదయాత్ర వల్లే 26 మంది ఎమ్మెల్యేల నుంచి 90 మంది ఎమ్మెల్యేల వరకు కాంగ్రెస్ గెలిచిందని, ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని స్పష్టంచేశారు. 

పార్టీని వీడిన వారు తిరిగి రండి : డిప్యూటీ సీఎం భట్టి 

రాష్ట్రంలో మరో రెండు దశాద్దాలు కాంగ్రెస్‌దే అధికారమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గతంలో కాంగ్రెస్‌ను వీడిన నేతలందరూ తిరిగి సొంత గూటికి రావాలని భట్టి పిలుపునిచ్చారు. ఇప్పుడు పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గతంలో కాంగ్రెస్‌ను వీడిన వారేనని తెలిపారు. వైఎస్సార్ అభిమానులు కూడా కాంగ్రెస్‌లోకి రావాలని, ఆయన ఆలోచనకు అనుగుణంగా పని చేస్తామని వెల్లడించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద పిల్లలకు వైఎస్సార్ దేవుడయ్యాడని కొనియాడారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మేమున్నాంటూ పేదలకు భరోసా ఇచ్చారని స్పష్టంచేశారు. హైదరాబాద్ అభివృద్థిలో వైఎస్సార్ చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, దానిని అమలు చేసి తీరుతామని ధీమాగా చెప్పారు.