21-04-2025 01:54:27 AM
నాకు మనిషిమీద విశ్వాసం
నాకు మట్టిమీద విశ్వాసం
మనిషి బతుకుదారి చూపిస్తాడు
మట్టి అన్నం పెడుతుంది
మనిషిని మనిషే నమ్మకుంటే
మనుగడ ఎలా సాగుతుంది?
మనిషి మనిషినే వంచిస్తే
మనిషి ఎలా అవుతాడు?
మనిషంటే
రక్తమాంసాల ముద్దకాదు
మనిషంటే మూర్తీభవించిన మానవత్వం
మనిషంటే పొంగిపొరలే కారుణ్యం
సాటి మనిషి కళ్ళల్లో నీరు చూస్తే
వాడి కళ్ళల్లోంచి నీరే
దుఃఖితుణ్ణి ఆశ్లేషించుకుంటాడు
కలిసి నడుస్తాడు
కలిసి జీవిస్తాడు
అందుకే నాకు మనిషంటే
వల్లమాలిన అభిమానం
మనిషిమీద ప్రగాఢ విశ్వాసం
మట్టి ఎంత గొప్పది?
ఆ మట్టే నన్నింత వాణ్ణి చేసింది
మట్టిలోనే నా బాల్యం
మట్టినే తిన్నాను
మట్టిలోనే ఆడాను
అమ్మలా నన్ను
లాలించింది ఈ మట్టే
ఆడించింది ఈ మట్టే
పాడించింది ఈ మట్టే
ప్రపంచజ్ఞానాన్ని ప్రసాదించింది ఈ మట్టే
ప్రయోజకుణ్ణి చేసిందీ ఈ మట్టే
అందుకే ఈ మట్టికి
వందే అంటున్నాను
అమ్మనే కన్న అమ్మ ఈ మట్టికి
అన్ని వేళలా ఋణపడ్డ వాణ్ణి
అన్నం పెట్టే ఈ మట్టిమీద నాకు
అఖండ విశ్వాసం
అన్నివేళలా ఆత్మీయతను పంచే
ఈ మనిషిమీద అనంతమైన అనురాగం
నాకు మనిషిమీద విశ్వాసం
నాకు మట్టిమీద విశ్వాసం.
‘మనిషి కోసం’ (2004)
వచన కవితా సంపుటి నుంచి..
డా.తిరునగరి రామానుజయ్య
25న వర్ధంతి