తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్న కథానాయికల్లో మీనాక్షి చౌదరి ఒకరు. నిరుడు ఈ అమ్మడు దళపతి విజయ్‌తో ‘ది గోట్’ సినిమాలో మెరిసింది. అయినా ఈ చిత్రం ఈ ముద్దుగుమ్మకు ఆశించిన మేర ఫలితానివ్వలేపోయింది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’తో మాత్రం ఈ భామ బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్ కథానాయకుడిగా వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకులను తన డ్రీమ్ రోల్‌లో పలుకరించనుంది. ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది మీనాక్షి. ఈ సందర్భంగా తన జీవితంలో ఎదుర్కొన్న కష్టతరమైన ఒక సందర్భాన్ని పంచుకుంది. “విజయ్‌తో కలిసి నటించిన ‘ది గోట్’ సినిమా విడుదల తర్వాత నా నటనపై ఆన్‌లైన్‌లో చాలా ట్రోల్స్ వచ్చాయి.
ఆ ట్రోల్స్ కారణంగా వారం రోజుల పాటు నేను డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను” అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా మీనాక్షి హీరో నవీన్ పొలిశెట్టితో కలిసి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ చేస్తోంది. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన వెడ్డింగ్ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన దక్కింది.