స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయపాల్‌రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతికిరణ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. శుక్రవారం మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ రిలీజ్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. “బార్బరిక్’ చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కు వస్తే ఎలా ఉంటుందో చూపించారు” అన్నారు. సత్యరాజ్ మాట్లాడుతూ.. ‘ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇకపై మేం అంతా (బార్బరిక్ టీమ్) రాజా సాబ్‌లమే.
ఈ సినిమాకు కథే హీరో. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది’ అని చెప్పారు. నిర్మాత విజయ్‌పాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మారుతి గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నందుకు ఆయనకు ఎప్పుడూ రుణ పడి ఉంటాను.
ఈ మూవీ కోసం ఇంఫ్యూజన్ బాండ్‌ను తీసుకొచ్చాను’ అన్నారు. హీరోయిన్ సాంచి రాయ్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు ఫస్ట్ తెలుగు సినిమా. నాకు ఇక్కడ అనంతమైన ప్రేమ లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు మోహన్ శ్రీవత్స, సత్యం రాజేశ్, నటుడు క్రాంతి కిరణ్, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, ఇతర చిత్రబృందం పాల్గొన్నారు.