న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ తన హుందాతనాన్ని మరోసారి చాటుకున్నాడు. బీసీసీఐ తనకు అందిం చిన రూ. 5 కోట్ల బోనస్‌ను ద్రవిడ్ సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ రూ. 125 కోట్ల నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. జట్టులోని 15 మంది ఆటగాళ్లకు రూ. 5 కోట్లు చొప్పున.. రిజర్వ్ ఆటగాళ్లకు రూ. కోటి చొప్పున అందించింది. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించిన రాహుల్ ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు బోనస్‌గా ప్రకటించింది. ద్రవిడ్ సహాయక సిబ్బంది అయిన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రేలకు తలా రెండున్నర కోట్లు అందించింది.
ఈ నేపథ్యంలో ద్రవిడ్ తన బోనస్ సగానికి (రూ. 2.5 కోట్లు) తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ‘ద్రవిడ్ కూడా తన సహాయ కోచింగ్ సిబ్బందితో సమానంగా బోనస్‌ను పంచుకోవా లనుకుంటున్నాడు. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించినందుకు ద్రవిడ్‌కు రూ. 5 కోట్లు బోనస్‌గా ఇచ్చాం. కానీ తన సహాయ సిబ్బంది అందుకున్న రూ. 2.5 కోట్లే తనకు ఇవ్వాలని కోరాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం’ అని బీసీసీఐ ప్రతినిధి తెలిపారు. గతంలో టీమిండియా యువ జట్టు అండర్ వన్డే ప్రపంచకప్ గెలిచిన సమయంలోనూ ద్రవిడ్ ఇలాగే అదనపు బోనస్‌ను అందుకునేందుకు నిరాకరించి.. తోటి సహాయక సిబ్బందికి ఇచ్చినంత మొత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు.