calender_icon.png 27 October, 2024 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరువు అక్కర్లేదు.. అంతా మనోళ్లే!

27-10-2024 12:00:00 AM

నవ్వు నాలుగు విధాల చేటు అనేవారు అప్పట్లో.. ఇప్పుడు నవ్వు నలభై విధాల మేలు అంటున్నారు. అందుకే లాఫింగ్ థెరపి అందుబాటులోకి వచ్చింది. పనిగట్టుకుని మరీ బలవంతంగా నవ్వుతున్నాం. అలాకాకుండా మనస్ఫూర్తిగా నవ్వించే శక్తి ఎవరికైనా ఉంటే వారితో గడిపేందుకు ఇష్టపడతాం. అలా ఒక్కరిని కాదు.. కొన్ని లక్షల మందిని నవ్వించే సత్తా ఒక్క కమెడియన్‌కే ఉంటుంది.

సినిమా జానర్ ఏదైనా... సీరియస్‌గా కథ ముందుకు వెళుతూ ఉంటే ఒకరకమైన విసుగు వచ్చేస్తుంది. మధ్యలో కమెడియన్ ఎంట్రీ ఇచ్చి సరదా సన్నివేశంతో మనల్ని నవ్విస్తే మనసు తేలికవుతుంది. తిరిగి కథలోకి లీనమవుతాం. కమెడియన్ మాత్రమే మనలోని స్ట్రెస్ అంతటినీ తీసేయగలడు. 

అప్పుడు ఇప్పుడూ ఎప్పుడూ కమెడియన్లకు ప్రాధాన్యం అయితే తగ్గదు. ఒక విలన్ లేకుండా.. హీరోయిన్ లేకున్నా.. చివరకు హీరో లేకున్నా సినిమా నడుస్తుందేమో కానీ కమెడియన్ లేకుంటే కష్టం. అసలు ఆ సినిమాకు ఆదరణ ఎంతవరకనేది చెప్పడమూ కష్టం.

కమెడియన్ లేడు అంటే సినిమాకు అదొక పెద్ద లోటు అనే చెప్పాలి. మత్తు వదలరా 1, 2 హిట్ అయ్యాయంటే అది పక్కాగా ఓ కమెడియన్ కారణంగానే. అది మరెవరో కాదు సత్య. ఆయన ఫేస్‌లోనే ఒక అమాయకత్వం కనిపిస్తుంది. వెన్నెల కిశోర్ అయినా సరే.. ముఖంలో అమాయకత్వంతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారు. 

ఎంత పెద్ద హీరో అయినా..

అప్పట్లో రేలంగి, రమణారెడ్డి, రాజబాబు వంటి వారు ఇండస్ట్రీని ఏలారు. ఆ తరువాత బ్రహ్మానందం, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎంఎస్ నారాయణ, ఎల్‌బీ శ్రీరాం, పృథ్వీరాజ్ వంటివారు నడిపించారు. కొంతకాలం పాటు సునీల్ హవా నడిచింది. ఆ తరువాత కూడా నడిచేదేమో.. ఆయన కథానాయకుడి పాత్రలకు స్టిక్ అవకుంటే..

ఇక ఇప్పుడు వెన్నెల కిశోర్, సత్య, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, అభినవ్ గోమఠం, వైవా హర్ష, సుదర్శన్.. చెప్పుకుంటూ పోతే ఎం దరో ఇండస్ట్రీకి ఆరోప్రాణం. ప్రస్తుతం ఇండస్ట్రీని నడిపిస్తున్నవి రెండే జానర్లు. అవి సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ ఎంటర్‌టైనర్.. ఎంత పెద్ద హీరో సినిమా అయినా కమెడియన్ తప్పక ఉంటారు.

కమెడియన్‌గా కొన్ని దశాబ్దాల పాటు మనల్ని నవ్వించిన అలీ.. ఆ తర్వాతి కాలంలో హీరోగా మారారు. కానీ దానికే స్టిక్ అవలేదు. తిరిగి కమెడియన్ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో తన ముద్ర చెరిగిపోకుండా చూసుకున్నారు. అలాగే శ్రీనివాసరెడ్డి.. కమెడియన్‌గానూ.. హీరోగానూ రాణిస్తున్నారు.

కనిపిస్తే నవ్వులే..

బ్రహ్మానందం ప్రధాన పాత్రలోనూ సినిమాలొచ్చాయి. కానీ ఆయన కూడా తిరిగి కమెడియన్ పాత్రలు చేశారు. తను చెప్పిందే మాట.. చేసిందే శాసనం అన్నట్టుగా కొంతకాలం హవా సాగించారు. స్టార్ హీరో రేంజ్ ఆయనది. బ్రహ్మానందం స్క్రీన్‌పై కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం నవ్వులు విరబూసేవి. అది అతి తక్కువ మందికే సాధ్యం. 

రవ్వంత గర్వాన్ని చూడలేము..

సమస్యలు లేని మనిషంటూ ఉండడు. అలాగే కమెడియన్‌గా రాణించాలనుకునే వ్యక్తికీ ఉంటాయి. ఎన్నో సమస్యలను అధిగమిస్తే కానీ ఒక సినిమాలో నటించే అవ కాశాన్ని పొందగలుగుతాడు. తర్వాత తన సమస్యలన్నింటినీ పక్కనబెట్టి.. లక్షల మందిని తాను పంచే వినోదంతో సమస్యల నుంచి బయటకు కొన్ని నిమిషాల పాటు లాగగలిగే సత్తా ఒక్క కమెడియన్‌కే ఉంటుంది.

ఎంత ఎత్తుకు ఎదిగినా వీరిలో రవ్వంత గర్వాన్ని మనం చూడలేము. ‘మత్తు వదలరా 2’ సక్సెస్ మొత్తం ఒక కమెడియన్ ఖాతాలో పడిపోయింది. చిరంజీవి నటించే యాడ్‌లో సత్యకు స్థానం లభించడం మామూలు విషయం కాదు. ఆ అదృష్టం కొందరినే వరిస్తుంది. టాలెంట్ ఎవడబ్బ సొత్తూ కాదు.. ఒక కమెడియన్‌లో అంత పెద్ద డైరెక్టర్ దాగున్నాడని.. దాగుంటాడని ‘బలగం’ వచ్చే వరకూ మనం ఊహించలేదు. 

టాలీవుడ్ చేసుకున్న అదృష్టం 

తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నంత మంది కమెడియన్లు మరే పరిశ్రమలోనూ లేరంటే అతిశయోక్తి కాదు.. హీరో, హీరోయిన్, విలన్ కోసం దర్శకనిర్మాతలు వేరే ఇండస్ట్రీలకు వెళుతున్నారేమో కానీ కమెడియన్ కోసం మాత్రం ఏ ఇండస్ట్రీ వైపు చూడాల్సిన అవసరం లేదు.

వేరే ఏ నటుడినైనా అరువు తెచ్చుకుంటున్నామేమో కానీ కమెడియన్లను మాత్రం కాదు. ఇది తెలుగు సినీ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. మన తెలుగు వారికి భాషపై పట్టుంటుంది కాబట్టి సీన్ అర్థం చేసుకుని దానికి అనుగుణంగా నటిస్తూ మనల్ని కడుపుబ్బ నవ్వించగలుగుతున్నారు.

ఈ జనరేషన్‌కు అయితే వెన్నెల కిశోర్, సత్య, ప్రియదర్శి, అభినవ్ గోమఠం వంటి వారే ఇండస్ట్రీని నడిపిస్తున్నారనడంలో సందేహం లేదు. చాలా మంది నటులు వస్తుంటారు.. పోతుంటారు.. కమెడియన్స్ మాత్రం లోకల్. 

- ప్రజావాణి చీదిరాల