22-03-2025 01:14:20 AM
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేయకపోవడంతో ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. కీలక విభాగాల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టకపోవడంతో ఇటు నిరుద్యోగులు, ఆటు మ్యాన్‌పవర్ లేక సంబంధిత విభాగాలు తీవ్రంగా నష్టపోయినాయన్నారు.
గత ప్రభుత్వం భారీగా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికి నిధులు మాత్రం ఖర్చు చేయలేదని, అసెంబ్లీ ఆమోదం లేకుండానే రూ. 2.30 లక్షల కోట్లు ఖర్చు పెట్టిన్టలు లెక్కల్లో చూపారని, ఈ విషయాలను స్వయంగా కాగ్ బయటపెట్టిందని బీఆర్‌ఎస్‌పై ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై చర్చ సందర్భంగా శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లడుతూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
‘ఆర్ధిక క్రమ శిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు చేశారు. పదేళ్ల కాలంలో రూ. 16.70 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టి ఏమి చేశారో చెప్పాలి. దొడ్డిదారిని ఓఆర్‌ఆర్ అమ్ముకున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని ముందే లాక్కున్నారు. మీలాగా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. అలా పెంచితే రూ. 4.18 లక్షల కోట్లు అయ్యేది. మేము అలా చేయకుండా.. వాస్తవాల మీద బడ్జెట్ పెట్టాం.
మీకు ఆదాయం ఉన్నా లేకున్నా పెంచుతూ పోయారు. జీఎస్టీ గ్రోత్ దేశం కంటే తక్కువ ఉంది అన్నాడు హరీష్‌రావు. బీఆర్‌ఎస్ హయాంలో జీఎస్టీ 8.4 శాతం ఉంటే ఇప్పుడు 12.3 శాతం పెరిగింది. విద్యావంతుడైన హరీష్‌రావు ఆర్థిక మాంద్యమా..? బుద్ధి మాంద్యమా..? సభ నాయకుడికి అజ్ఞానం అంటున్నాడు.
భాష పట్ల కొంత పద్ధతిగా ఉండాలి. గత పదేళ్లలో రూ. 13. 80 వేల కోట్లతో పాటు పనులు చేసిన వారికి బిల్లుల కింద మరో రూ. 40 వేల కోట్లు పెండింగ్‌లో పెట్టారు. మొత్తం పదేళ్లలో రూ. 16.70 వేల కోట్లు ఖర్చు చేశారు. ఇన్ని వేల కోట్లు ఖర్చు చేసి ఏమి చేశారు. నాగార్జున సాగర్ కట్టారా..? బీడీఎల్ కట్టారా..? ఈసీఐఎల్ కట్టారా..?’ అని భట్టి విక్రమార్క నిలదీశారు.
మీరు చేసిన అప్పులు మేం చెల్లిస్తున్నాం..
మేము అధికారంలోకి వచ్చాక రూ. 2, 80, 603 కోట్లు ఖర్చు చేశాం. జీతాలు రూ.77,362 కోట్లు, అప్పుల కింద రూ.88, 009 కోట్లు చెల్లించాం. రూ. 1.34 వేల కోట్లు పథకాల కోసం ఖర్చు చేశాం. వచ్చిన ఆదాయం రూ. 2.80,603 కోట్లు. ఖర్చు రూ. 2,99,421 కోట్లు చేశాం. మేం అధికారంలోకి వచ్చాక రూ. 1, 53, 359 కోట్లు అప్పులు చెలించాం.
మే చేసిన అప్పు రూ. 4, 682 కోట్లు మాత్రమే. మీలాగా నాలుగు గోడల మధ్య బంధించుకుని లేం. మీ పదేళ్ల కాలంలో లక్ష ఇండ్లు కూడా కట్టలేదు. ఇండ్ల గురించి మీరు మాట్లాడితే ఎట్లా..? మీరు పరీక్షలు పెట్టలేదు.. పెట్టిన పరీక్షల ప్రశ్నా పత్రం లీక్ అయ్యాయి. మేము అలా చేయలేదు. వాళ్ళు మా పిల్లలుగా భావించి ఉద్యోగాలు ఇస్తున్నాం.
ఉద్యోగాలు రాని పిల్లలకు రాజీవ్ యువ వికాసం పేరుతో రూ. 6 వేల కోట్లు ఇవ్వబోతున్నాం. బ్రాహ్మణ పరిషత్‌కి రూ. 50 కోట్లు ఉండే.. ఇంకో రూ. 50 కోట్లు కలిపి ఇచ్చాం. వైశ్యులు కార్పొరేషన్ కావాలని అడిగితే మీరు ఇవ్వలేదు. మేము రాగానే కార్పోరేషన్ ఏర్పాటు చేసి రూ. 25 కోట్లు వెచ్చించాం’ అని తెలిపారు.
దళితులను మోసం చేశారు..
‘దళితున్ని సీఎం చేస్తా అని ఓట్లేయించుకున్నారు.. చేయలేదు. డిప్యూటీ సీఎంగా రాజయ్యను నియమించి రాత్రికి రాత్రే బర్తరఫ్ చేశారు. దేశంలో ఇదే తొలి సారని.. ఇప్పటీకి కారణం చెప్పలేదు. దళితబంధు పేరుతో రూ. 17,700 కోట్లు పెట్టారు.. ఒక్క పైసా విడుదల చేయలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ తూచ తప్పకుండా అమలు చేస్తాం. ఐకేపీల గురించి మాట్లాడే హక్కు మా కాంగ్రెస్ పార్టీకే ఉంది.
ప్రతి మండలంలో ఐకేపీల కోసం గోడౌన్‌లు కట్టిస్తం. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువుల అమ్మకాలకి మార్కెట్లు ఏర్పాటు చేశాం. పదేళ్లు పాలన గాలికి వదిలేసింది మీరు. మమ్మల్ని క్షమాపణ చెప్పాలి అంటున్నారు. క్షమాపణ చెప్పాల్సింది మీరా..? మేమా..? 58 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నాం. 240 రెసిడెన్షియల్ స్కూల్స్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నాం.
మీరు ఆ పిల్లల గురించి మాట్లాడితే ఎట్లా..? డైట్ చార్జీలు పెంచారా ఎప్పుడైనా..? 200 శాతం కాస్ట్యూమ్ చార్జెస్ పెంచినం. ప్రజల రక్తం గుంజుకోవడానికి ఎల్‌ఆర్‌ఎస్ అని అంటున్నారు.. ఎల్‌ఆర్‌ఎస్ తెచ్చిందే మీరు కదా.?’ అని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. పేదలు ఇబ్బంది పడుతున్నారని తాము ఎల్‌ఎర్‌ఎస్ తీసుకొచ్చామని ఆయన వివరించారు.
అన్ని మాఫీయాలను కట్టడి చేస్తున్నాం..
మేము ఇసుక మీద రోజుకు మూడు కోట్ల ఆదాయం తెచ్చాం. ఇసుక మాఫియాను కట్టడి చేశాం.అన్ని మాఫియాలు కట్టడి చేస్తాం. వనరుల దోపిడి అడ్డుకుంటాం..ఆదాయం పెంచుతాం. మీ పదేళ్లలో రూ.6 వేల కోట్లు ఖజానాకు రాకుండా పోయింది. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఇచ్చారా..? మీలాగా వదిలేయం..చదివిస్తం.. ఉద్యోగాలు ఇస్తాం.. ఉపాధి కల్పిస్తాం.. పదేళ్లలో మీరు రైతుల రుణాలు మాఫీ చేసింది ఎంత..? నాలుగు నెలల్లో మేము మాఫీ చేసింది ఎంతో తెలుసా..?
మేం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల లోనే రూ. 20, 617 కోట్లు సింగిల్ టైంలో రుణమాఫీ చేశాం . ఇది మా కమిట్మెంట్. బీఆర్‌ఎస్ వాళ్ళు స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఎట్లా..? నేను కూడా ఎల్‌ఓపీగా కూర్చున్నాను. ఏ ఒక్కరోజైనా డెమొక్రటిక్‌గా వ్యవహారం చేశారా..? మేం తల వంచుకుని పని చేసుకుంటూ పోయాం.మేం ఎప్పుడు సభానాయకుడి గురించి నోరు జారలేదు. ఇంట్లో నుంచి బయటకు వద్దాం అంటే అరెస్టు చేసేవాళ్లు.
సిఎల్పీ సభ్యులుగా మేము భద్రాచలం పోతే అర్థరాత్రి అడవుల్లో ఎమ్మెల్యేలను వదిలేశారు. వీళ్ళు నిర్బంధం గురించి మాట్లాడుతున్నారు..? వీళ్లు కృష్ణానది జలాల గురించి మాట్లాడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఎక్కువ నీటి దోపిడి చేస్తోంది.. వెళ్లి చూద్దాం అంటే అరెస్టు చేశారు. రాయలసీమ లిఫ్ట్‌కి సహకరించింది మీరు. అరెస్టులు మమ్మల్ని చేసి.. రాష్ట్రానికి నీళ్లు రాకుండా గోవిందా చేసింది మీరు..?
పైగా బడ్జెట్ పై మాట్లాడుతూ గోవిందా గోవింద అంటున్నారు. పోడు భూములు అడిగితే మహిళలను చెట్టుకు కట్టేసి కొట్టారు. కానీ మేము గిరిజనుల కోసం రూ.12, 500 కోట్లతో గిరి వికాసం పథకం పెట్టాం. గిరిజనుల జీవితాల్లో మార్పులు తెస్తాం. మిమ్మల్ని కూడా పిలుస్తాం. అవసరం అనుకుంటే మీతోనే రిబ్బన్ కటింగ్ చేయిస్తాం. బీఆర్‌ఎస్ పదేళ్లలో సంక్షేమం కోసం కోటి 81,877 కోట్లు కేటాయించి.. రూ. 70,475 కోట్లు ఖర్చే చేయలేదు’ అని భట్టి వివరించారు.