అవును నిజం.. నిన్ను నేను సముద్రపు ఉప్పు నీటిలో పెరిగిన గులాబీనో
ఖరీదైన పుష్యరాగ వైడూర్యాన్నో..
లేదా నిప్పుల్లోంచి ఎగసిపడినట్లుండే ఎర్రని పూల బాణాలనో ప్రేమించినట్లు
అస్సలు ప్రేమించలేను.
అయితే నిన్నస్సలు ప్రేమించనని కాదు ప్రేమిస్తాను!
కానీ అందరిలా మాత్రం కాదు!
కొంతమంది ప్రేమిస్తారు చూడూ.. నీడకి, ఆత్మకి మధ్య చీకట్లో
రహస్యంగా..
నిశ్శబ్దంగా అర్థమే కాకుండా
అస్పష్టంగా ఉండే వాటిని
ప్రేమించినట్లు?
అలా మాత్రమే నేను నిన్ను
ప్రేమించగలను.
ఇంకా ఎప్పటికీ వికసించని మొక్కని ప్రేమించినట్లు నిన్ను నేను ప్రేమిస్తాను!
ఎందుకో తెలుసా.. వికసించని ఆ మొక్క తన లోపల దాచుకున్న పూల
కాంతిని నా దగ్గరకి తీసుకొస్తుంది.
ప్రియురాలా,
నీ ప్రేమకి నా సలాములు!
ఎందుకంటే..
నీ ప్రేమ మూలంగా మాత్రమే భూమి నుంచి వెల్లువెత్తినట్లుండే ఒక
నిఘూడమైన ప్రేమ పరిమళం..
నా దేహంలోని చీకటిలా నన్ను నిత్యం ఆవరించి ఉంటుంది.
ఒకటి మాత్రం చెప్పగలను! ఎప్పుడు, ఎలా.. ఎక్కడ నుంచి అన్నది
తెలుసుకోకుండానే నిన్ను నేను ప్రేమించడం మొదలు పెడతాను.
బేషజం, అహం లాంటి ఏ సమస్యలూ లేకుండానే
ముక్కు సూటిగా నేరుగా
నిన్ను ప్రేమిస్తాను.
నేను నిన్నులాగే ప్రేమింగలను! ఎందుకంటే వేరేలాగా ప్రేమించడం ఎలాగో ఆ దారులే నాకు తెలీదు కాబట్టి!
ఎక్కడైతే నువ్వూ.. నేనూ, ఇద్దరమూ ఉండమో.. అక్కడ ఎంత
దగ్గరగా అంటే..
ఎలా అయితే నా గుండెలపై నీ చేయి.. నాదిలా మారుతుందో..
ఎప్పుడైతే.. నువ్వు కళ్ళు మూసుకుని నా కలలు మాత్రమే కంటావో..
అంత సామీప్యానికి..
మరోలా.. ఒక పువ్వునో.. ఒక ఖరీదైన పుష్యరాగ వైడూర్యాన్నో..
అంటే ఒక వస్తువును ప్రేమించినట్లు నిన్నెలా ప్రేమించాలి చెప్పు?
నా లోపలి కాంతిలా.. చీకటిలా ఉన్న నిన్ను ఒక రహాస్యంగా.. రహస్యంగా, ప్రేమించడం తప్ప..?
--- పాబ్లో నెరుడా
(1904-1973)
అనువాదం: డాక్టర్ గీతాంజలి