calender_icon.png 27 December, 2024 | 1:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మాయిగానే ఉండటం ఇష్టం లేదు

01-08-2024 12:05:00 AM

తనదైన అందం, అభినయం, ఆంగికంతో తెలుగు, తమిళ భాషల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది కీర్తి సురేశ్. తన ‘కీర్తి’ కిరీటంలో జాతీయ పురస్కారాన్ని తురిమిన ‘మహానటి’ చిత్రమే ఈ సొగసరి నటనకు చక్కటి ఉదాహరణ. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇటీవల బ్యాక్‌లెస్ ఫొటోలతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. తాజాగా ‘సరైన అమ్మాయిలా ఉండటంపై నాకు ఇష్టం లేదు’ అంటూ కీర్తి సురేశ్ చెప్తున్న మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఔనా, కీర్తి అలా ఎందుకు అన్నది అని ఆలోచిస్తున్నారా? ఈ అమ్మడు ప్రస్తుతం ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘పార్సీ’ వంటి వెబ్ సిరీస్‌ల కథానాయకుడు సుమన్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రఘుతాత’లో నటిస్తున్న సంగతి తెలుసు కదా! ఆ సినిమాలోని ఓ సన్నివేశంలో భాగంగా చెప్పిన మాటలే అవి.

ఆగస్టు 15న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. అందరి ముందు ఒక అమ్మాయిలా ఎలా ప్రవర్తించాలో నేర్చుకోమని చెప్తుంటే, అబ్బాయిల కంటే తాను ఏమాత్రం తక్కువ కాదనే విధంగా ప్రవర్తిస్తూ ట్రైలర్‌లో దర్శనమిచ్చింది కీర్తి సురేశ్. హిందీ భాష నేర్చుకోవటం తప్పనిసరి అనే విధానానికి వ్యతిరేకంగా ‘రఘుతాత’ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. స్త్రీ, పురుషుల సమానత్వం అంశాన్నీ ఇందులో లేవనెత్తినట్టు స్పష్టమవుతోంది. హిందీ రాని ఓ తమిళ అమ్మాయిగా ఈ చిత్రంలో కనిపించనున్న కీర్తి ‘ఏక్ గావ్ మే ఏక్ కిసాన్..’ అంటూ హిందీ నేర్చుకుంటున్న సీన్ నవ్వులు పూయించింది. సాతంత్య్ర దినోత్సవ కానుకగా ఆగస్టు 15న హిందీ భాషలో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకువస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ వస్తుందా.. లేదా? అనేదానిపై ఇప్పటికైతే దర్శక నిర్మాతలు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.