calender_icon.png 12 December, 2024 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాను

12-12-2024 02:25:24 AM

* నా పదవికి బీఆర్‌ఎస్ కూడా మద్దతు ఇచ్చింది 

* కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఫైర్

హైదరాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): శాసన సభాపతి తీరు వల్లే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు శిక్షణ తరగతులను బహిష్కరిస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను స్పీకర్‌ను.. ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. నేను స్పీకర్ కావడానికి బీఆర్‌ఎస్ కూడా మద్దతు ఇచ్చింది.  బీఆర్‌ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఆ పార్టీ నేతలు ఉన్నారు.  సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్.. స్పీకర్ వ్యవస్థపై ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సరైంది కాదు. 

ఇలాంటి వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్ పార్టీ ప్రజల్లో విశ్వాసం కోల్పోతుంది’ అని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్‌కుమార్ హితవు పలికారు. సభలో వివిధ పార్టీల సభ్యులు ఉన్నప్పటికీ.. స్పీకర్‌కు అన్ని పార్టీల సభ్యులు సమానమేనని స్పష్టం చేశారు. అధికార పార్టీకి చెందిన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టుగానే ప్రతిపక్ష పార్టీలకు కూడా అవకాశం ఇస్తున్నామని తెలిపారు.  సభను ప్రధాన ప్రతిపక్షం సద్వినియోగం చేసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.  

శిక్షణకు దూరంగా బీఆర్‌ఎస్.. 

శాసనసభ చట్టాలు, నియమ, నిబంధనలకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇచ్చిన శిక్షణ తరగతులకు 56 మంది సభ్యులు హాజరయ్యారు. ఈ సదస్సుకు కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాగా.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దూరంగా ఉన్నారు.