మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన సినిమా ‘లక్కీభాస్కర్’. దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయిక. దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా గురువారం మీడియాతో ముచ్చటించిన దర్శకుడు వెంకీ అట్లూరి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
“లక్కీ భాస్కర్’కు ఒక్క శాతం కూడా నెగెటివ్ స్పందన రాలేదు. నిజంగా ఇది గొప్ప విషయం.. అదృష్టంగా భావిస్తున్నా. కొన్ని సంభాషణలు అప్పటికప్పుడు చిత్రీకరణ సమయంలో రాశాను. వాటికి కూడా ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. బ్యాంకింగ్ నేపథ్యం కదా.. కథ రాసేటప్పుడు ఎంతో రీసెర్చ్ చేసి, ప్రతి సన్నివేశాన్ని చిన్న పిల్లలకూ అర్థమయ్యేలా రాసుకున్నా. మొదట కథ రాసుకున్నప్పుడు ఇంత భారీ సినిమా అవుతుందనుకోలేదు.
నిజమైన లొకేషన్లలో షూటింగ్ చేసి, తక్కువ బడ్జెట్‌లో పూర్తి చేయొచ్చనే ఆలోచనలోనే ఉన్నా. కానీ వంశీ గారు కథను బాగా నమ్మారు కాబట్టే ఎక్కడా రాజీ పడకుండా సెట్లు వేసి సినిమాను భారీస్థాయిలో నిర్మించారు. నేను తర్వాత ఏ జానర్ సినిమా చేయాలనే నిర్ణయానికి ఇంకా రాలేదు. ప్రస్తుతం కొన్ని కథా ఆలోచనలు ఉన్నాయి. కచ్చితంగా మరో మంచి చిత్రంతో అలరించడానికి ప్రయత్నిస్తా” అని చెప్పారు.