సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి
- పోలీసుల మాట ఖాతరుచేయని హీరో అల్లు అర్జున్
- అసలు మానవత్వం ఉందా?
- ఒక్క రోజు జైలుకు పోతే ఆయనను పరామర్శిస్తూ.. సినిమా ఇండస్ట్రీ అంతా నన్ను తిడుతోంది
- చావుబతుకుల్లో ఉన్న బాలున్ని పరామర్శించేందు ఒక్కరూ ముందుకు రాలేదు
- సినిమాలు తీసుకోండి.. వ్యాపారాలు చేసుకోండి
- ప్రాణాలు పోతుంటే ఉపేక్షించం
హైదరాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): పుష్ప-2 హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ ఎవరూ సంధ్య థియేటర్‌కు రావొద్దని పోలీసులు ముందేచెప్పినా వారు వినలేదని, రాత్రి 9.30 గంటల సమయం లో హీరో థియేటర్‌కు వచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తరువాత థియేటర్ నుంచి వెళ్లిపోవాలని హీరోను ఏసీపీ కోరారన్నారు.
సినిమా పూర్తయ్యేంతవరకు ఉంటానని హీరో చెప్పినట్లు సిటీ కమి షనర్ తనతో చెప్పారని సీఎం పేర్కొన్నారు. ‘థియేటర్ బయట ఉన్న పరిస్థితి దృష్ట్యా డీసీపీ నేరుగా హీరో వద్దకు వెళ్లారు. బయట ఒకరు చనిపోయారు, మీరు వెళ్లిపోవాలని, లేకపోతే పీఎస్‌కు తీసుకెళ్లాల్సి ఉంటుందని హీరోకు చెప్పారు. పోలీసులు పంపించడంతో రాత్రి 12 గంటలకు థియేటర్ నుంచి హీరో బయటకు వచ్చారు.
తొక్కిసలాటలో ఓ తల్లి చనిపోయిందని, ఆమె కుమారుడు చావు బతుకుల మధ్య ఉన్నారని తెలిసి కూడా.. పరిస్థితి బాగాలేదని చెప్పినా కూడా వాహనంపైకి ఎక్కి రోడ్ షో చేసుకుంటూ చేతులు ఊపారు.’ అని రేవంత్ రెడ్డి తెలిపారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతి, ఆమె కొడుకు తీవ్రంగా గాయపడిన ఘటనను అసెంబ్లీలో శనివా రం ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ లేవనెత్తగా సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నెలకు రూ. 30వేల చిన్న ఉద్యోగం చేసే తండ్రి.. కొడుకు హీరో అభిమాని అని రూ. 12 వేలు పెట్టి టికెట్లు కొని సినిమాకు వెళ్తే, తన భార్య థియేటర్‌లో చనిపోతే.. కొడుకు చావుబతుకుల మధ్య హాస్పిటల్‌లో కొట్టుమిట్టాడుతుంటే 11 రోజల వరకు హీరోకానీ, ప్రొడ్యూసర్‌కానీ కనీసం పరామర్శించలేదు.
ఇదెక్కడి మానవత్వం. మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను విధి నిర్వహణలో భాగంగా పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్తే ఆయనో భగవత్ స్వరూపుడన్నట్లుగా.. మంత్రిగా పనిచేసిన ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఓ వ్యక్తి మరణానికి కారణమైన వాళ్లను స్టేషన్‌కు తీసుకువస్తే దాన్ని కూడా తప్పు పట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని, ముఖ్యమంత్రిపై నీచమైన భాషతో రాసారు.
ఆ సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇచ్చాం. మొదటి వారం బెన్ఫిట్ షోలు వేసేందుకు అంగీకరించాం. సినీ పరిశ్రమను ప్రోత్సహించే క్రమంలో ప్రజల ప్రాణాలు పోయినా ఫర్వాలేదంటే ఎలా... ప్రాణాలు తీసినా పొలిటికల్ స్టార్లు, సినిమా స్టార్లపై కేసులు పెట్టవద్దని చట్టం చేస్తే అమలు చేస్తాం. ఈ కేసులో ప్రాణాలు పోయేందుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వాళ్లపై చట్ట ప్రకారం శిక్షించాల్సిందే.
ఘటన జరిగిన 11 రోజులైనా ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఒక్క రోజు జైలుకు పోయి వస్తే ఆయనకు యాక్సిడెంటో కాళ్లు చేతులు పోయినట్లు సినీ ప్రముఖులు కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వాన్ని, నన్నూ తిడుతున్నారు. తల్లి చనిపోయి 9 ఏళ్ల బాలుడు హాస్పిటల్‌లో కోమాలో ఉంటే ఈ ప్రముఖులు ఒక్కరన్నా పోయి పరామర్శించారా?.
హీరో కాళ్లు పోయాయా, కన్ను పోయిందా... చేయి పోయిందా... కిడ్నీలు దెబ్బతిన్నాయా... ఏమైంది. ఇంత మంది పరామర్శిస్తునారు...కానీ ఆ బాలున్ని పరామర్శించేందుకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. సినీ ప్రముఖులు ఏం ఆలోచిస్తున్నారో, ఏం కోరుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం’ అని రేవంత్ రెడ్డి అన్నారు.
రోడ్ షో చేస్తూ..
‘నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదే లేదో నాకు తెలీదు. ఎక్స్‌రోడ్డు చౌరస్తా ముందే నుంచి రూఫ్‌టాఫ్ ద్వారా ఆ చిత్ర బృందం రోడ్ షో చేస్తూ థియేటర్‌కు వచ్చారు. ఆ సమయంలో చుట్టూ ఉన్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న అభిమానులు ఇక్కడికే వచ్చారు. హీరో కారును లోపలకు పంపించేందుకు గేటు తెరిచారు.
హీరోను కలిసేందుకు వేలాదిగా జనం ఒకేసారి థియేటర్‌వైపు వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయారు. హీరోను చూడాలి.. కలవాలని అభిమానులు రావడంతో.. హీరో వెంట ఉన్న 50, 60 మంది బౌన్సర్లు నెట్టివేయడంతో తోపులాట జరిగింది.
ఈ ఘటనలో ఆమె చనిపోయింది.. ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన వెంటనే తల్లి, కుమారుడిని రక్షించేందుకు పోలీసులు యత్నించారు.’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సంధ్య థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖను తిరస్కరించినా... సినిమా హీరో బెన్ఫిట్ షో చూసేందుకు వచ్చారని సీఎం తెలిపారు.
సినిమా అయిపోయేవరకు ఉంటా..
తల్లి చనిపోయింది... కుమారుడు కూడా చావు నోట్లో ఉన్నాడని తెలిసి హీరోకు చెప్పేందుకు పోలీసులు ప్రయత్నించినా థియేటర్ యాజమాన్యం అనుమతి ఇవ్వలేదని సీఎం తెలిపారు. థియేటర్ సిబ్బంది తీరుపై ఆగ్రహించి చివరకు హీరో వద్దకు పోలీసులు వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. థియేటర్‌లోనే కాకుండా బయట ఉన్న వేలాదిమందిని అభిమానులను నియంత్రించలేక శాంతిభద్రతలు చేజారిపోయాయని లాఠీచార్జ్జి చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పారన్నారు.
ఆ చట్టం ఉందంటే చెప్పండి నేను అమలు చేస్తాను...
‘ఒక్క రోజు జైలుకు పోతే హైకోర్టు వెంటనే లంచ్ మోషన్ తీసుకుని బెయిల్ ఇచ్చింది. అర్ధరాత్రి 12 గంటలకు జైలు గేట్లు తెరిచేందుకు నాకు హక్కు లేదు. నిబంధనలకు వ్యతిరేకంగా ఆ సినిమా స్టార్‌ను అర్ధరాత్రి జైలు నుంచి విడుదల చేస్తే మరుసటి నేను అధికారంలో ఉండే పరిస్థితి లేదు. అర్ధరాత్రి 12 గంటలకు జైలు నుంచి విడుదల చేసే చట్టం ఉందంటే చెప్పండి నేను అమలు చేస్తాను.
సినిమా వాళ్లకు బాధ్యత ఉందో లేదో నాకు తెలియదు కానీ రాజకీయ పార్టీల నేతలు తమ మిత్రుడిని ఎలా అరెస్టు చేస్తారని నన్ను తిడుతున్నారు. మీకు, మీ దోస్త్‌కు కొత్త చట్టం ఏదైనా తెస్తే తీసుకురండి. మీ మిత్రుడైతే బారా ఖూన్ మాఫీ అయిపోతుందా. నా కుటుంబమైనా ఎవరికైనా చట్టం ప్రకారమే తాము ప్రభుత్వాన్ని నడిపిస్తాం.
అనుమతి లేకుపోయినా సినిమాకు రావడమే కాకుండా రూప్ టాప్ వాహనంలో చేతులు ఊపుకుంటూ వెళ్లినా ఆయనకు బెయిల్ లభించింది. సినిమా వాళ్లు మానవత్వం లేకుండా ప్రవర్తించవద్దు. సినిమాలు తీసుకోండి. అన్ని రాయితీలు పొందండి. లాభాలు పొందండి.
అన్నీ చేసుకోండి కానీ ప్రాణాలు పోయిన తర్వాత కూడా ప్రత్యేక హక్కులు కావాలంటే నేను సీఎం కుర్చీలో ఉన్నంత వరకు అది సాధ్యం కాదు. ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని మా ప్రభుత్వం వదిలిపెట్టదు’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హీరోను పీఎస్‌కు తరలిస్తే తిట్టారు..
హీరోను పీఎస్‌కు తరలిస్తే తనను తిట్టారని... ఘటన తర్వాత 11 రోజులకు పోలీసులు హీరో ఇంటికి వెళ్లారని సీఎం తెలిపారు. కేసు నమోదు అయిందని హీరోకు పోలీసులు చెప్పారని... ఘటనలో ఏ11గా కేసు నమోదు అయిందని చెప్పారని... అప్పుడు పోలీసుల పట్ల అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. విచారణలో భాగంగా హీరోను పోలీసులు పీస్‌కు తీసుకెళ్లారని అన్నారు.
హీరోను పీఎస్‌కు తీసుకెళ్తే కొందరు నేతలు తనను తిడుతూ పోస్టులు పెట్టారని తెలిపారు. చనిపోయిన వారి ప్రాణాలకు విలువ లేకుండా, చావుకు కారణమైన వారిని పీఎస్‌కు తీసుకెళ్తే తప్పుపడుతున్నారని దుయ్యబట్టారు. ఈ ఘటనలో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నించారన్నారు.
ఈ ఘటనలో సీఎంను నీచమైన భాషలో తిట్టారని చెప్పారు. సినిమా పరిశ్రమను ప్రోత్సహించాలని టికెట్ల రేట్లు పెంచుకునేందుకు, స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వివరణ ఇచ్చారు.
ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు
‘సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి.. డబ్బులు సంపాదించుకోండి.. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి.. షూటింగ్‌కు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి.. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు’. అని సినిమా ఇండస్ట్రీకి సీఎం హెచ్చరికలు పంపారు. తాను కుర్చీలో ఉన్నంతవరకు ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు. ఈనెల 4న పుష్ప -2 విడుదలవుతుందని, అదే రోజు హీరో, హీరోయిన్, సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని బందోబస్తు కావాలని సంధ్య థియేటర్ యాజమాన్యం ఈనెల 2న చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేశారని ఆయన తెలిపారు.
థియేటర్ రాసిన లేఖకు పోలీసులు ఈనెల 3న రాతపూర్వక సమాధానం ఇచ్చారన్నారు. సంధ్యా థియేటర్‌కు వెళ్లి, వచ్చేందుకు ఒకే మార్గం ఉందని, చుట్టు పక్కల ఇతర థియేటర్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అందులో తెలిపారని వివరించారు. సంధ్య థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. వచ్చే జనాలను నియంత్రించడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
చనిపోయినా కొడుకు చేయి వదల్లేదు...
థియేటర్, బాల్కనీ, కింద అంతా పెద్దఎత్తున జనం తరలివచ్చారు. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో నలుగురు కుటుంబ సభ్యులు వేరువేరుగా అయిపోయారు. రేవతి, శ్రీతేజ్ ఒకవైపు, భర్త, కూతురు మరోవైపు పడిపోయారు. జనాన్ని క్లియర్ చేసి చూస్తే తల్లి కొడుకును తన చేతులతో గట్టిగా పట్టుకుని కనిపించింది.
అప్పటికే ఆమె చనిపోయి ఉన్నా... పోలీసులు వచ్చి ఆమె చేతి నుంచి బాబును తీసేందుకు ప్రయత్నిస్తే రావడం లేదు. చనిపోయినా కూడా ఆమె కొడుకు చేయిని వదల్లేదు. బాబుకు ప్రథమ చికిత్స అందించి హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. బాబు బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు... అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇంత జరిగిందని పోలీసులు చెప్పినా కూడా హీరో అక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించలేదని ఆయన తెలిపారు.
చనిపోయారా... అయితే సినిమా హిట్ అవుతుంది
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఒకరు చనిపోయారు.. ఇద్దరు గాయపడ్డారు.. మీరు ఇక్కడి నుంచి వెళ్లాలని ఆ హీరోకు పోలీసులు తెలిపితే.. అవునా, అయితే సినిమా హిట్ అవుతుందని సదరు హీరో అన్నట్లు తెలిసిందని ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ శనివారం నాడు అసెంబ్లీలో తెలిపారు.
రైతుభరోసా స్వల్పకాలిక చర్చ సందర్భంగా ప్రసంగించిన ఆయన, సినిమా చూసేందుకు వచ్చి తల్లి మృతిచెందడం, కొడుకు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న విషయంపై మాట్లాడారు. ఒకరు చనిపోయి.. ఇద్దరు గాయపడినా కూడా సినిమా అయిపోయేంత వరకు ఉండి వెళ్లేటప్పుడు కూడా ఆ హీరో చేతులు ఊపుతూ వెళ్లారని అన్నారు.
అలాంటి వారి పట్ల ప్రభుత్వం అనుసరించిన తీరుపై కొందరి ఇది కరెక్టు కాదంటూ మాట్లాడుతున్నారని.. ఇదేం పద్ధతి, వీరికి కనీసం మానవత్వం ఉందా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత హృదయవిదారకమైన ఘటన జరిగినా కనీసం ఆ హీరో వారిని పరామర్శించలేదని అన్నారు. ఓవైపు ప్రాణాలు పోతే ఇంకోవైపు చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ పోవడమేంటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనలో ప్రభుత్వం, పోలీసులు తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఎంఐఎం పార్టీ మద్దతునిస్తుందని తెలిపారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాలుడు త్వరగా కోలుకునాలని తాము ప్రార్థిస్తున్నామని అన్నారు. చనిపోయిన తల్లికి సంతాపం తెలుపుతున్నామన్నారు.