calender_icon.png 11 January, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెప్పింది చేశా!

11-01-2025 01:01:52 AM

ఉన్నతాధికారుల సూచనతోనే నగదు బదిలీ

  1. మేం ఇరుక్కుపోతామని ముందే తెలుసు 
  2. ఏసీబీ విచారణలో హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డి

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): ఉన్నతాధికారులు సూచనల మేర కే హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో) సంస్థకు నగదు బదిలీ చేయాల్సి వచ్చిందని హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డి శుక్రవారం ఏసీబీకి స్పష్టం చేసినట్లు తెలిసింది.

ఫార్ములా ఈ- రేసు కేసులో శుక్రవారం హైదరాబాద్‌లో ని ఏసీబీ కార్యాలయంలో బీఎల్‌ఎన్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. ఐఏఎస్ అధికారి అర్వింద్‌కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు ఆరున్నర గంటల పాటు బీఎల్‌ఎన్ రెడ్డిని విచారించారు. ‘అప్పటి పరిస్థితులు నగ దు బదిలీని ఆపేలా లేవు. నిబంధనలకు విరుద్ధంగా ముందుకు వెళ్లి నగదు బదిలీ చేయాల్సి వచ్చింది.

ఈ విషయంలో తాము ఇరుక్కుపోతామని ముందే తెలుసు’ అని, తాను ఏసీబీ విచారణకు సహకరిస్తానని, ఈడీ అడిగిన ప్రశ్నలే మళ్లీ ఏసీబీ కూడా అడుగుతున్నదని, ఇప్పటికే ఆయా ప్రశ్నలకు ఈడీకి సమాధానం ఇచ్చానని బీఎల్‌ఎన్ రెడ్డి తెలిపినట్లు సమాచారం.

మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన అభియోగాలపై ఈ నెల 8న బీఎల్‌ఎన్ రెడ్డిని ఈడీ సుమారు 8 గంటల పాటు విచారించింది. ఈడీ సంధించిన ప్రశ్నలకు కాస్త, అటు ఇటుగా తాజాగా ఏసీబీ  ప్రశ్నించినట్లు విశ్వసనీయ సమాచారం.

 నిధుల బదిలీ జరిగింది ఇలా..

రాష్ట్ర మున్సిపల్ శాఖ ఫార్ములా ఈ-రేసు సీజన్ నిర్వహణకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో)కు రూ.110 కోట్లు (90,00, 000 బ్రిటన్ పౌండ్లు) చెల్లించేందు కు ఒప్పందం చేసుకుంది. మొదటి వాయిదా కింద 2023 సెప్టెంబర్ 25న 22,50,000 పౌండ్లు (రూ. 22,69,63,125), రెం డో వాయిదా కింద సెప్టెంబర్ 29న మరో 22,50, 000 పౌండ్లు (రూ. 23,01,97, 500) చెల్లించాల్సి ఉంది.

కానీ, ఆ నిధులు హెచ్‌ఎండీఏ బోర్డు ఖాతా నుంచి బ్రిటన్‌కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు వెళ్లినట్లు ఈడీ గుర్తించింది. అక్టోబర్ 3న మొదటి వాయిదా కింద రూ.22,69 ,63,125, అక్టోబర్ 11న రెండో వాయిదా కింద రూ .23,01,97, 500 చెల్లింపు జరిగింది.

రెండు వాయిదాలు కలిపి రూ. 45.71 కోట్లు, ఐటీ శాఖకు అదనంగా చెల్లించిన రూ.8 కోట్ల పెనాల్టీతో కలిపి మొత్తం రూ.54.89 కోట్లు ఎఫ్‌ఈవోకు నగదు బదిలీ జరిగింది. ఏసీబీ తాజాగా బీఎల్‌ఎన్ రెడ్డిని ఈ నగదు బదిలీపైనే లోతుగా విచారించినట్లు తెలుస్తున్నది.