- పని మీద ఫారిన్ వెళ్లాను
- యూట్యూబర్ హర్షసాయి
రాజేంద్రనగర్, నవంబర్ 4: తాను ఎలాంటి తప్పు చేయలేదని, పని మీద ఫారిన్ వెళ్లానని యూట్యూబర్ హర్షసాయి తెలిపారు. విదేశాల నుంచి సోమవారం ఆయన శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలాంటి తప్పు చేయకపోవడంతోనే బెయిల్ వచ్చిందన్నారు.
అదేవిధంగా తాను ఎవరినీ డబ్బులు కూడా డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేస్తానని పేర్కొన్నారు. బిగ్బాస్లో కంటెస్ట్ చేసిన ఓ యువతి హర్షసాయి తనపై లైంగిక దాడి చేశాడని, తనను బెదిరించి రూ. 2 కోట్లు తీసుకున్నాడని కొద్దిరోజుల క్రితం నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి పరారీలో ఉన్న ఆయనకు ఇటీవల బెయిల్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఉన్నట్టుండి హర్షసాయి శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రత్యక్షమయ్యారు. తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా సత్యదూరమన్నారు. తాను రాసిన, తీసిన సినిమాకు వాళ్లే కాపీరైట్స్ అడిగారని ఆరోపించారు. తాను ఎవరినీ డబ్బులు డిమాండ్ చేయలేదని, తీసుకోలేదని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై కుట్ర చేసి ఇమేజ్ దెబ్బతీసే యత్నం చేశారని ధ్వజమెత్తారు. త్వరలో సినిమాను రిలీజ్ చేస్తానని హర్షసాయి ప్రకటించాడు.