ఆ వార్తల్లో నిజం లేదు
మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్
నానా పటోలే
ముంబై, నవంబర్ 25: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే రాజీనామా చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ వార్తలు నిజం కాదంటూ పటోలే స్వయంగా స్పందించారు. తాను రాజీనామా చేయలేదని తేల్చిచెప్పారు. మహావికాస్ అఘాడీ కూటమి చెక్కుచెదరకుండా ఉందని స్పష్టంచేశారు. మహారాష్ట్ర అసెంబ్లీలో 288 సీట్లు ఉండగా.. మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించింది.
ప్రతిపక్ష అఘాడీ కూటమికి 51 సీట్లే వచ్చాయి. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుచుకుంది. దీంతో మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారింది. కొన్ని వర్గాలపైనే అధికంగా ఆధారపడటం, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లకపోవడం తదితర కారణాలతో పార్టీకి ప్రజల్లో ఆదరణ కరువైందని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నానా పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పోటీ చేసిన 17 స్థానాల్లో 13 స్థానాలను గెలుచుకొని విజయఢంకా మోగించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పటోలే సాకొలీ స్థానం నుంచి కేవలం 208 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.