06-04-2025 12:13:51 AM
టీవీ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా నటించిన చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. దర్శక ద్వయం డుయో నితిన్, భరత్ దర్శకత్వంలో మాంక్స్‌అండ్‌మంకీస్ బ్యానర్‌పై రూపొందుతోందీ సినిమా. దీపికా పిల్లి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ నెల 11న థియేటర్లలోకి రానున్న చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘ప్రియమార..’ ఈ పాటకు రధన్ స్వరాలు సమకూర్చగా రాకేందు మౌళి సాహిత్యం అందించారు.
శరత్ సంతోష్, లిప్సిక భాష్యం ఆలపించిన ఈ మెలోడీ ‘ప్రియమారా.. మౌనాల చాటు మాటలే తెలియదా, కనులారా.. నీ అందం చూసి ఆగదే నా యెద..’ అంటూ సాగుతోంది. ఇందులో నాయకానాయికలు ప్రదీప్ దీపికల కెమిస్ట్రీ, ఆన్-స్క్రీన్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రానికి సందీప్ బొల్లా కథ, డైలాగ్స్ రాయగా, ఎంఎన్ బాలరెడ్డి కెమెరామెన్‌గా, కోదాటి పవన్‌కళ్యాణ్ ఎడిటర్‌గా పనిచేశారు.