calender_icon.png 23 October, 2024 | 3:54 AM

‘నీకో దండం, మీ పార్టీకో దండం’ పార్టీలో కొనసాగలేను

23-10-2024 02:03:10 AM

  1. నన్ను చంపినట్లుగానే భావిస్తున్నా 
  2. గంగారెడ్డి హత్యపై జీవన్‌రెడ్డి ఆగ్రహం
  3. ఘటనపై ఆరాతీసిన టీపీసీసీ చీఫ్ ఫోన్‌ను మధ్యలోనే కట్ చేసిన జీవన్ రెడ్డి
  4. జగిత్యాల- ధర్మపురి హైవేపై బైఠాయింపు

కరీంనగర్, అక్టోబరు 22 (విజయక్రాంతి): జగిత్యాల కాంగ్రెస్ నాయకుడు మారు గంగారెడ్డి దారుణ హత్య రాష్ట్రం లో సంచలనంగా మారింది. తన ముఖ్య అనుచరుడు దారుణ హత్యకు గురికావడంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర భావోద్వే గానికి లోనయ్యారు.

గంగారెడ్డి హత్యకు నిరసనగా జగిత్యాల ధర్మపురి ప్రధాన రహదారిపై జీవన్‌రెడ్డి బైఠాయించి నిరసనకు దిగారు. పోలీసుల తీరుపై జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్‌ఎస్ నేతలే హత్య చేయించారని ఆరోపించారు. ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అక్కడికి చేరుకుని జీవన్‌రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో మాట్లాడుతూ ‘నీకో దండం.. మీ పార్టీకో దండం.. ఇకపై స్వచ్ఛంద సంస్థ పెట్టుకుని పనిచేస్తా’నని అన్నారు. పార్టీలో అవమానాలను భరిస్తూ ఉండలేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎందుకు బతకడం అంటూ లక్ష్మణ్‌తో ఆవేదన చెందారు. పార్టీ ఫిరాయింపుదారుల వల్లే ఈ హత్య జరిగిందని జీవన్ రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది.

కాంగ్రెస్ నాయకులకు జిల్లాలో రక్షణ లేదని, గంగారెడ్డిని చంపితే తనను చంపినట్లుగానే భావిస్తున్నానని ఆ యన ఉద్వేగంతో అన్నారు. గత మూడు నెలలుగా కాంగ్రెస్‌లో అవమానాలతోపాటు మానసిక క్షోభకు గురవుతున్నానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పది నియోజకవర్గాలలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారంటూ ఘాటుగా స్పందించా రు. కాంగ్రెస్ ముసుగులో బీఆర్‌ఎస్ నాయకులు హత్యలు చేస్తున్నట్లుగా విమర్శించారు. 

 పీసీసీ చీఫ్ ఫోన్‌ను మధ్యలోనే కట్ చేసిన జీవన్‌రెడ్డి..

గంగారెడ్డి హత్య విషయం తెలియగానే ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఫోన్‌లో మహేశ్‌కుమార్‌తో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ‘నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తే మంచి బహుమతి ఇచ్చారు.

క్షమించండి. నేను పార్టీలో కొనసాగలేను’ అని మధ్యలోనే ఫోన్ కట్ చేశారు. అంతకుముందు పీసీసీ చీఫ్ గాంధీ భవన్‌లో మాట్లాడుతూ అనుచరుడి హత్యతో జీవన్‌రెడ్డి మనస్థాపానికి గురయ్యారని అన్నారు. జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిని హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు.

హత్య చేసిన నిందితుడు పోలీసులకు ఎదుటు లొంగిపోయారని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బాధలో ఉండి తన ఆవేదనను వ్యక్తం చేశారని, తాను జీవన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు  వెల్లడించారు. మంత్రి శ్రీధర్‌బాబు ఈ విషయాన్ని పరిశీలన చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.  

హత్యా రాజకీయాలను ప్రోత్సహించం: ఎమ్మెల్యే సంజయ్  

గంగారెడ్డి హత్యను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గ అభివృద్ధిని ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరానని, ముమ్మాటికి హత్యా రాజకీయాలను ప్రోత్సహించనని స్పష్టం చేశారు. కొందరు కావాలని ఈ హత్యను రాజకీయం చేయడం బాధాకరమని అన్నారు. హత్య వెనుక ఉన్న నిందితులను, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.