సినీరంగం ఓ రంగుల లోకం. ఆ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనేది కొందరికి కల అయితే, మరికొందరికి జీవిత లక్ష్యం. కల నెరవేరవచ్చు.. కల్లలైపోవచ్చు. కానీ లక్ష్యాన్ని సాధించి తీరుతాం. నాది కల కాదు, లక్ష్యం అంటున్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ వాస్తవ్యుడైన జయశంకర్ వంగ. విభిన్నమైన కథలతో వెండితెరపై వి‘చిత్రాల’ను ఆవిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టే, ప్రేక్షకుల మనసు గెలిచి సార్థక నామధేయుడు అనిపించుకుంటున్నాడు. ఆ యువ దర్శకుడి రీల్ అండ్ రియల్ లైఫ్ విశేషాలు ఆయన మాటల్లోనే...
చిత్ర దర్శకుడు జయశంకర్ వంగ రీల్ అండ్ రియల్ లైఫ్
మా సొంతూరు పెద్దపల్లి జిల్లా ఎలిగేడ్ గ్రామం. అమ్మ పేరు ప్రమీల. నాన్న కనకయ్య. మాది టింబర్ బిజినెస్ బాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. నేను చిన్నప్పట్నుంచీ నేను పుస్తకాల పురుగును. అప్పట్నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. కచ్చితంగా డైరెక్టర్ కావాలనే డ్రీమ్ కాదు.. గోల్ ఉండేది నాకు! హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లోనే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్ రూపొందిస్తే అందరూ మెచ్చుకున్నారు.
నచ్చిన వ్యక్తులు.. మెచ్చిన పుస్తకాలు
అలనాటి మేటి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతోపాటు కే రాఘవేంద్రరావు దర్శకత్వం అంటే చాలా ఇష్టం. దాసరి నారాయణరావు, మహేశ్ భట్, కే విశ్వనాథ్‌లను ఆరాధిస్తూ పెరిగా. ఈ తరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ అంటే ఇష్టం. కానీ, నా వర్క్ మీద కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది. చిరంజీవి, మహేశ్‌బాబు ఇష్టమైన తారలు. ప్రాచీన సాహిత్యంతోపాటు మోడరన్ లిటరేచర్‌నూ చదువుతుంటా. నవలలు ఇష్టంగా చదువుతా. ఫ్రెడరిక్ నీట్షే, ముప్పాళ్ల రంగనాయకమ్మ, పీజీ వోడ్‌హౌస్ రచనలు నాపై ప్రభావం చూపాయి.
నేను చదివిన బుక్స్, కలిసిన మనుషులు, చూసిన సినిమాలు, నాకు ఎదురైన అనుభవాలన్నీ నాకు కథ రూపంలో తెరపైకి వస్తాయి. సమాజంలో నాకు నచ్చిన అంశాలు, నేను నమ్మిన సిద్ధాంతాలు ఎక్కువగా ప్రేక్షకులకు కనిపిస్తాయి. దానికి ఉదాహరణే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను తీసిన ‘విటమిన్ షి’ షార్ట్‌ఫిల్మ్. ఇదే సబ్జెక్టును ఓ ఫీచర్ ఫిల్మ్‌గా మలచాలన్న ఆలోచన కూడా ఉందిప్పుడు.
ప్రముఖులతో కలిసి తొలి సినిమా
చదువు పూర్తయిన తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నప్పటికీ నా ధ్యాసంతా సినిమాల మీదే ఉండేది. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా ప్రముఖ నవలా రచయిత, సినీ రైటర్ కొమ్మనాపల్లి గణపతిరావు గారిని కలిసి మాట్లాడాను. ఆయన ఓ పరీక్ష పెట్టి, తన వద్ద అసిస్టెంట్ రైటర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ అనుభవంతోనే తర్వాతి కాలంలో అభిషేకం, అపరంజి వంటి టీవీ సీరియల్స్‌కు రైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశా. తొలుత నాకు డైరెక్షన్ అవకాశాలేవీ రాలేదు. అందుకే రైటింగ్ మీద నా ఫోకస్ ఎక్కువగా ఉండేది. అలా సంపత్ నంది గారి వద్ద రైటింగ్ అసిస్టెంట్‌గా చేరా. ఆయనకు నా వర్క్ నచ్చడంతో ‘పేపర్ బాయ్’ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సంపత్ గారే ఆ ప్రాజెక్టుకు నిర్మాత. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు. అదే నా లైఫ్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్.
సినీ రంగంలోకి రావాలనుకుంటే...
నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ముఖ్యం. సాహిత్యంలాగానే సినిమా కూడా ఒక ఆర్ట్ ఫామ్. సబ్జెక్టు నాలెడ్జి చాలా ముఖ్యం. మన రైటింగ్ మన స్థాయి ఏమిటో ఎదుటివారికి చెప్పేస్తుంది. అందుకే కథలు చదవాలి.. రాయాలి. సినిమాలు చూడాలి. దాన్ని అనేక కోణాలలో విశ్లేషించాలి. అప్పుడే ఊహాశక్తి పెరుగుతుంది. షేక్స్‌పియర్, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారికే సాహిత్య రంగంలో ఆటుపోట్లు తప్పలేదు. మనం ఏ మాత్రం? అయితే ప్రగాఢమైన ఆకాంక్ష ఉంటే, గమ్యాన్ని చేరుకోగలం. చాలా సందర్భాల్లో క్లోజ్‌గా ఉన్నవాళ్లే నమ్మక ద్రోహం చేస్తారు. ఇవన్నీ తట్టుకొని ఉంటేనే ఈ ఫీల్డ్‌కి రావాలి.
కెరీర్ ప్రారంభమైందిలా..
జయశంకర్ 2014 నుంచి సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. అర డజనుకు పైగా తెలుగు సినిమాలకు స్క్రిప్టులు, డైలాగులు రాశారు. ఆయన తీసిన లఘుచిత్రాల్లో ‘హాఫ్ గర్ల్‌ఫ్రెండ్’ (2014), ‘రామాయణంలో తుపాకుల వేట’ (2016), ‘ది గాడ్ మస్ట్ బీ క్రేజీ’ (2015) వంటి షార్ట్ ఫిలిమ్స్ చెప్పుకోదగ్గవి. కాగా, మరికొన్ని షార్ట్ ఫిలిమ్స్ ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకొని ప్రేక్షకుల మన్ననలు పొందాయి. అయితే 2018లో ‘పేపర్ బాయ్’ చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారాయన.