calender_icon.png 22 October, 2024 | 1:00 PM

సినీరంగం మీద ఇష్టంతోనే దర్శకుడిగా మారాను

23-07-2024 12:05:00 AM

రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. రాధిక శరత్‌కుమార్, చరణ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. తొలి చిత్రంగా వెంకట సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 26న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా పాత్రికేయులతో సమావేశమైన ఆయన, సినిమాకి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. “మనం ఏ పని చేసినా దానికి ముందు చేద్దామా.. వద్దా.. అన్న సంఘర్షణ జరుగుతుంది. ఒక మనిషి తప్పు చేసినా, ఒప్పు చేసినా దానికి ఆలోచనే కారణం. అలాంటి ఆలోచనలకు తెర రూపమివ్వాలనే ప్రయత్నంలో భాగంగా చేసిందే ‘ఆపరేషన్ రావణ్’. మన ఇతిహాసాల్లో రామాయణం ఒక థ్రిల్లర్ అని నా భావన.

ఈ సినిమాలోనూ రామాయణం రిఫరెన్స్ తీసుకున్నాం. గరుత్మం తుడు, రావణుడు, గుహుడు వంటి పాత్రల ఛాయలు కనపడతాయి. రావణుడు మారువేషం వేసుకుని వచ్చినట్టే సినిమాలో విలన్ మాస్క్ పెట్టుకుని ఉంటాడు. ఈ టైటిల్ పెట్టడానికి అదే కారణం. ప్రేమ విఫలమైనా.. అందులో అనుమానాలు తలెత్తినా యువత సైకోలుగా మారడం చూస్తూనే ఉన్నాం. ఆ విషయాన్నీ సినిమాలో ప్రస్తావించాం. స్క్రీన్ మీద మా ఐడియా ఎంతవరకు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది అనేది చూసేందుకు ఎదురుచూస్తున్నాం. ఆగస్టు 2న విడుదలవుతున్న సినిమాలు ఎక్కువగా ఉండటంతో ఈ నెల 26వ తేదీకి మార్చాం. ‘ఆపరేషన్ రావణ్’ రాధిక గారు చేసిన సినిమాల్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. సినిమా ప్రారంభమైన గంటలోపు సైకో ఎవరన్నది కనిపెడితే.. సిల్వర్ కాయిన్ ఇస్తామని ప్రకటించాం.

అలా వెయ్యిమందికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. ఈ సినిమాను అనుకున్న బడ్జెట్‌లో అనుకున్న డేట్స్ లోపే చేశాను. 30 నుంచి 40 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. నేను చదివిన పుస్తకాల్లోని కొన్ని విషయాలు దర్శకత్వంలో ఉపయోగపడ్డాయి. సినీ రంగం మీద ఇష్టంతోనే దర్శకుడిగా మారాను. కేవీ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, రాజమౌళి, హాలీవుడ్‌లో స్టీవెల్ స్పీల్ బర్గ్ నా అభిమాన దర్శకులు. ‘పలాస 2’తో పాటు మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమా విడుదల తర్వాత వాటి వివరాలు వెల్లడిస్తాం” అని తెలిపారు డైరెక్టర్ వెంకట సత్య.