16-03-2025 01:30:49 AM
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ‘కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.. రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతాను’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మొదటిసారి బీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకీ ఓట్లువేశారని, రెండోసారి తమపై ప్రేమతో ఓట్లువేస్తారని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
శనివారం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో సీఎం చిట్‌చాట్‌గా మాట్లాడారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులే తమ ఓటర్లు అని, తాను పనిని నమ్ముకుని ముందుకు వెళ్తానని రేవంత్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తాము నిలబెట్టుకుంటామన్నారు. ‘నాకు స్టేచర్ కాదు.. స్టేట్ ఫ్యూచరే ముఖ్యం. రాష్ట్రంలో రూ. 2 లక్షల వరకు.. 25 లక్షలకు పైగా కు టుంబాలకు రైతు రుణమాఫీ జరిగిందని చెప్పారు.
ఒక్కో కుటుంబంలో నలుగురు ఉన్నా, రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి మంది ఉంటారు’ అని సీఎం పేర్కొన్నారు. కోటి మంది మహిళలకు కచ్చితంగా లబ్ధి చేకూరుస్తామని, వారిని తమ ప్రభుత్వం కోటీశ్వరులను చేస్తుందని తెలిపారు. వారందరూ ఇప్పుడు మాట్లాడకపోయినా కాంగ్రెస్ పార్టీకే వారంతా ఓట్లు వేస్తారని సీఎం చెప్పారు. గతంలో తాను చెప్పిందే జరిగిందని, భవిష్యత్‌లోనూ తాను చెప్పిందే జరుగుతుందన్నా రు.
2026లో జనాభా లెక్కలు పూర్తిచేసి 2027లో వాటిని నోటిఫై చేస్తారనే అంచనా ఉందని, దీనికి అనుగుణంగా కేంద్రం డీలిమిటేషన్‌కు సమాయత్తమవుతోందన్నారు. అందుకే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోకుండా తాము ప్రయత్నాలు చేస్తున్నామని రేవంత్‌రెడ్డి చెప్పారు.