calender_icon.png 20 September, 2024 | 5:23 AM

నేను రాహుల్ వదిలిన బాణాన్ని!

20-09-2024 02:46:36 AM

  1. కుల గణన తర్వాతే స్థానిక పోరు 
  2. పీసీసీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతం పదవులు 
  3. బీఆర్‌ఎస్‌కు దమ్ముంటే బీసీ బిడ్డను అధ్యక్షుడిని చేయాలి 

పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ 

బీసీ ప్రధాని కులగణనకు ఎందుకు ఒప్పుకోవడం లేదు? 

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు

అధికారం ఎవరూ ఇవ్వరు.. లాక్కోవటమే: పొన్నం 

ఉన్నతస్థాయికి ఎదగటం తేలిక కాదు: సీతక్క 

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): ‘నేను రాహుల్‌గాంధీ వదిలిన బాణాన్ని. బీసీల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. నన్ను ఒక ధ్యేయంతో పీసీసీ అధ్యక్షుడిని చేశారు. వారు కోరిన విధంగానే ముందుకు పోవాలని నా తపన. ఎవరి జనాభా ఎంతో.. వారికి అంత వాటా అని రాహుల్‌గాంధీ చెప్పారు. కుల గణన చేసిన తర్వాతనే పెరిగిన జనాభా మేరకు రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తాం. బడుగుల మద్దతుతోనే కాంగ్రెస్ అధికారం లోకి వచ్చింది.

బీసీ కుల గణన అంటే కాంగ్రెస్ పేటెంట్. నా కమిటీలో 60 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తా. రాబోయే రోజుల్లో కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తాం’ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ‘సోషల్ జస్టిస్‌ె క్యాస్ట్ సెన్సెన్’ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నేతృత్వంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు అధ్యక్షతన గురువారం మహేశ్‌కుమార్‌గౌడ్‌కు ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల రిజర్వేషన్లను 42 శాతం నుంచి 23 శాతానికి తగ్గించి అన్యాయం చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌కు దమ్ముంటే ఒక బీసీ బిడ్డకు పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసే బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్ష బాధ్యత నుంచి ఎందుకు తొలగించారో చెప్పాలని నిలదీశారు.

కాంగ్రెస్ పార్టీలో నే సామాజిక న్యాయం జరుగుతుందని, సీఎం గా రేవంత్‌రెడ్డి ఉంటే, తనకు పీసీసీ అధ్యక్ష పదవిని ఇచ్చారని గుర్తుచేశారు. దేశంలో అందరికీ సమానత్వం కావాలనేది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆలోచన అని తెలిపారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకు ప్రతి ఒక్కరు పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గత పదేళ్లు రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని.. మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. 

బీసీ ప్రధాని కులగణన ఎందుకు చేయరు?: వీహెచ్

బీసీ ప్రధాని అని చెప్పుకునే నరేంద్రమోదీ కులగణన ఎందుకు చేయడం లేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఓబీసీ ఎంపీల ఫోరం మాజీ కన్వీనర్ వీ హనుమంతరావు ప్రశ్నించారు. కుల గణన చేయాలని రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ను అధిష్ఠానం నియమించడం సంతోషకరమని పేర్కొన్నారు. బీసీల జనాభా మేరకు అన్నింటిలో అవకాశాలు రావాలని వీహెచ్  అన్నారు. బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని చూస్తున్నదని మండిపడ్డారు. 

పోరాటం చేసి హక్కులు లాక్కోవాలి: మంత్రి పొన్నం 

వారసత్వ రాజకీయాలు కాకుండా క్షేత్ర స్థాయిలో పార్టీ జెండా పట్టుకుని పనిచేసి పైకి వచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అవకాశాలు ఎవరో ఇస్తారని అనుకోకూడదని, పోరాటం చేసి గుంజుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీతో సామాజిక న్యాయం జరుగుతుందని, భవిష్యత్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశాలుంటాయని తెలిపారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని చెప్పారు. కులగణనపై అసెంబ్లీలో బిల్లు పెట్టడంతోపాటు బీసీ కమిషన్‌ను కూడా నియమించినట్లు మంత్రి పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విద్యార్థి స్థాయి నుంచి వచ్చిన తాను పార్టీ జెండా వదలకుండా, పార్టీ మారకుండా కాంగ్రెస్‌లోనే ఉన్నానని తెలిపారు. 

కింది స్థాయి నుంచి ఎదిగిన మహేశ్: సీతక్క

విద్యార్థి దశ నుంచి ఎదిగిన నేత మహేశ్‌కుమార్‌గౌడ్ అని మంత్రి సీతక్క ప్రశంసించారు. అట్టడుగు వర్గాల నుంచి ఎదిగిన వారు ఈ పదవికి వన్నె తెచ్చారని పేర్కొన్నారు. ఈ రోజుల్లో ఉన్నత స్థాయికి రావడం చాలా కష్టమని అన్నారు. రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయనకు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నీ తానై పని చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వినోద్, వీర్లపల్లి శంకర్, మక్కన్ సింగ్ ఠాకూర్, ఎమ్మెల్సీలు అమీర్ అలీఖాన్, ఎగ్గె మల్లేశం, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు నిర్మలా జగ్గారెడ్డి, ఈరవత్రి అనిల్, మెట్టు సాయికుమార్, శివసేనారెడ్డి, ప్రీతమ్, కాల్వ సుజాత, చల్లా నరసింహారెడ్డి, ముత్తినేని వీరయ్య, డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, మాజీ మంత్రి శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.