- ఐటీడీఏలకు పునరుజ్జీవం తెస్తాం
- డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నల్లగొండ, జనవరి 11 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం తప్పక అమలుచేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అమలు బాధ్యత సైతం తానే తీసుకుంటానని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. తాను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న సమయంలోనే సబ్ ప్లాన్ చట్టం రూపుదిద్దుకుందని గుర్తుచేశారు.
చట్టంపై తనకు పరిపూర్ణ అవగాహన ఉన్నదని చెప్పారు. బడ్జెట్‌లో ఐటీడీఏలకు భారీగా నిధులు కేటాయించి పునరుజ్జీవం తెస్తామని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌లో ట్రైకార్ ఆధ్వర్యంలో వారంరోజులుగా కొనసాగుతు న్న ఆదివాసీ, గిరిజ న కాంగ్రెస్ ప్రతినిధుల రాజకీయ శిక్షణ తరగతులు శనివారం ముగిశాయి.
నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం ఈ కార్యక్రమానికి హాజరై శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అందించి మాట్లాడారు. ఇందిరమ్మ ఆత్మీ య భరోసా పథకం కింద భూమిలేని పేదల ఖాతాల్లో ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రూ.12 వేలు జమచేయనున్నట్లు తెలిపారు.
సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి రూ. 12 వేల పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఆదివాసీ, గిరిజన నిరుద్యోగులకు శిక్షణనిచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పీసా, అటవీ హక్కుల చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాజ్యాంగాన్ని బలహీనపరిచి పేదల హక్కులు కాలరాసేందుకు దేశంలో కుట్ర జరుగుతుందని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు సంఘటితమై పోరాడాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో తొలిదశలో 4 లక్షల మంది పేదలకు రూ. 22,500 కోట్లతో ఇండ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తన విజయంలో గిరిజనుల పాత్ర మరువలే నిదన్నారు. రాష్ట్రంలోని ప్రతి తండాలో పంచాయతీ, అంగన్‌వాడీ భవనం నిర్మిస్తామని చెప్పారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడు తూ.. ఆదివాసీ, గిరిజనులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. బీజేపీ ఇరువర్గాల మధ్య చిచ్చుపెట్టి వారిని అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నదని ఆక్షేపించారు. ఆదివాసీ, గిరిజనులు సంఘటితంగా ఆ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం లో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, బాలూనాయక్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.