పార్లమెంట్‌లో వయనాడ్ ఎంపీ ప్రమాణం
కేరళ సంప్రదాయ కసావు చీరలో సభకు హాజరు
న్యూఢిల్లీ, నవంబర్ 28: ఉప ఎన్నికల్లో వయనాడ్ స్థానం నుంచి భారీ మెజార్టీతో ఎంపీగా విజయం సాధించిన కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ గురువారం ప్రమాణస్వీకా రం చేశారు. ఆమె సోదరుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ఇతర ముఖ్యనేతలు వెంట రాగా.. కేరళ సంప్రదాయం ఉట్టిపడేలా కసావు చీరను ధరించిన ప్రియాంక లోక్‌సభలో అడుగుపెట్టారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓంబిర్లా కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణం చేయించారు. కాగా ప్రియాంక రాజ్యాంగ నకలును చేతిలో పట్టుకొని ఎంపీగా ప్రమాణం చేశా రు.
ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలిసారి ప్రియాంకగాంధీ భారీ విజయాన్ని అందుకున్నారు. కేరళలోని వయనాడ్ స్థానం నుంచి తన ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల అఖండ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇదే స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల మెజార్టీని ప్రియాంక అధిగమించారు. ఈ విజయంతో నెహ్రూ కుటుంబంలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన మూడో వ్యక్తిగా ప్రియాంక నిలిచారు. ఇంతకుముందు ఇందిరా గాంధీ, రాహుల్ ఈ జాబితాలో ఉన్నారు.