calender_icon.png 25 October, 2024 | 11:53 AM

అంత అమాయకురాలిని కాదు నేను!

06-07-2024 03:10:16 AM

తనదైన అందం, అభినయంతో అనతి కాలంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది సమంత. మనశ్శాంతిని కోరుకునే ఆమె ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కోరుకుంటారు. అలాంటిది ఆమె అనారోగ్యానికి గురికావడం, తరుచూ ప్రముఖ వైద్యులను కలవడం తప్పలేదు. ఈ నేపథ్యంలో తాను తెలుసుకున్న ఆరోగ్య సలహాలు శ్రేయోభిలాషులకూ చెప్తూ వచ్చేది. తన అభిమానులపై ప్రేమతో చెప్పిన ఓ ఆరోగ్య సలహా ఆమెను విమర్శల పాల్జేసింది. దీంతో ఆ విమర్శలపై సమంత స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ‘కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకుంటున్నాను. ప్రతి దాన్నీ డాక్టర్ల సలహా మేరకే ఉపయోగిస్తున్నా.

నేను పాటించి, ఫలితం వచ్చిన తర్వాతే ఇతరులకు టిప్స్ చెప్పాను. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైంది. నాకు ఆర్థిక స్థోమత ఉంది కాబట్టి ఖరీదైన వైద్యాన్ని భరించగలను. కానీ కొందరు ఇంత ఖర్చు పెట్టి ఈ వైద్యం చేయించుకోలేరు.. అలాంటి వాళ్ల గురించి ఆలోచించే నేను హెల్త్ టిప్స్ చెప్తుంటాను. దేని గురించైనా తెలుసుకోకుండానే ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్‌కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది. ఒక పెద్ద మనిషి (సమంత వైద్య సలహాలను విమర్శించిన డాక్టర్‌ను ఉద్దేశించి..) నా సలహాలను ఉద్దేశపూర్వకంగానే బలమైన పదాలతో దూషించారు.

ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉందనడంలో సందేహం లేదు. నన్ను నిందించడటం కన్నా నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. నన్ను జైల్లో పెట్టాలన్నందుకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను.. అయితే, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్ టిప్స్ ఇవ్వలేదు.. ఒక సామాన్యురాలిగానే పోస్ట్ చేశాను’ అని రాసుకొచ్చింది సమంత.