జయా కిశోరి.. ఆధ్యాత్మిక ప్రవచనలకు ఫిదా కానీ వారుండరు! ఆమె చెప్పే బోధనలు వింటూ ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనవుతారు భక్తులు. భక్తి పాటలతో, ఆధ్యాత్మిక ప్రసంగాలతో లక్షలాది మందిని ఆకర్షిస్తున్నది. ఇప్పుడీ ఈమె సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్. ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా పేరొందిన ఈమె.. ఇటీవల ఓ ఘటన ద్వారా నెగెటివ్ కామెంట్స్‌ను ఎదుర్కొన్నారు.. దానిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. అదేంటో చూసేయండి!
జయా కిశోరి వయసు కేవలం 29 ఏళ్లే. 1995 జులైలో రాజస్థాన్‌లోని సుజన్‌గఢ్‌లో జన్మించారు. ఏడేళ్ల ప్రాయం లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు. భక్తి పాటలతో ‘అభినవ మీరాబాయి’గా గుర్తింపు పొందారు. దాదాపు 20కి పైగా ఆధ్యాత్మిక ఆల్బమ్స్ ఆలపించారు. తాజాగా ఎయిర్ పోర్టులో ఆమె భక్తులకు తారసపడింది.
ఆ సమయంలో జయా కిశోరి లగ్జరీ లైఫ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. లగేజీ బ్యాగ్‌పై ఉన్న ‘డియోర్’ హ్యాండ్ బ్యాగ్ చూసి నివ్వెరపోయారు. ఆ హ్యాండ్ బ్యాగ్ ఖరీదు రూ.2 లక్షలకు పైగా ఉంటుంది. అంతేకాకుండా రూ.13లక్షలకు పైగా ఖరీదైన వాచ్‌ను కూడా ధరించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఖరీదైన హ్యాండ్ బ్యాగ్ అంశంపై జయా కిశోరి స్పందించారు. “బ్రాండ్‌లను చూసి బ్యాగ్‌లు ఉపయోగించను. నచ్చితే ఎక్కడికైనా వెళ్లి కొంటాను.. ఈ బ్యాగ్ అనుకూలంగా ఉండడంతో కొన్నా. ఆ బ్యాగ్ లెదర్‌దనే విమర్శలు కూడా వచ్చాయి. వినియోగదారులు కోరుకన్నట్లుగా ప్రత్యేకంగా రూపొందించిన బ్యాగ్ ఇది.
అందుకే దానిపై నా పేరు కూడా ఉంటుంది. నేనెప్పుడు లెదర్ వాడలేదు. నా మాటలు పూర్తిగా గమనిస్తే.. ప్రతిదీ మాయ అని నేను ఎప్పుడూ చెప్పలేదు. డబ్బు సంపాదించొద్దు, అన్నింటిని త్యజించండి అని చెప్పలేదు. నేను చేయనివాటిని ఎలా చెప్తాను. నేను సాధ్విని కాదనే స్పష్టత నాకు మొదటి నుంచి ఉంది. ఇదంతా నెగెటివ్ ప్లబిసిటీ. నన్ను అనుసరించి, విశ్వసించేవారి కోసమే ఈ వివరణ ఇస్తున్నా..
ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకునేంత పిచ్చిదాన్ని కాదు’ అని అన్నారు. “నేను సాధారణ అమ్మాయిని, సాధారణ ఇంట్లోనే కుటుంబంతో కలిసి జీవిస్తున్నా.. కష్టపడి పని చేయండి.. డబ్బు సంపాదించండి.. మీతో పాటు మీ కుంటుబానికి మంచి జీవితాన్ని ఇవ్వండి.. మీ కలలు నెరవేర్చుకోండని యువతకు నేను చెప్తుతుంటాను” అని జయా కిశోరీ అన్నారు. జయా కిశోరీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 12.3 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.