సిడ్నీ టెస్టు నుంచి తప్పుకోవడంపై క్లారిటీ
సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో టెస్టు నుంచి భారత కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకోవడంతో అతడు చివరి టెస్టు మ్యాచ్ ఆడేశాడంటూ శుక్రవారం మీడియాలో కథనాలు హోరెత్తాయి. ఈ వార్తలను హిట్‌మ్యాన్ శనివారం స్వయం గా ఖండించాడు. ‘నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు. సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే తపుకున్నా.
జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నా. తొలి టెస్టులో జైస్వాల్ జోడీ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో జట్టు విజయం లో కీలకపాత్ర పోషించారు. ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో పక్కకు తప్పుకున్నా. ఫామ్‌లో లేకపోవడంతో ఐదో టెస్టు నుంచి తప్పుకోవడంపై కోచ్ గంభీర్, వైస్ కెప్టెన్ బుమ్రాతో చర్చించాను.
నా నిర్ణయాన్ని వారు అంగీకరించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి సమస్యలు లేవు. ఇప్పుడు పరుగులు చేయడంలో సతమతమవుతున్నా. రాబోయే ఐదు నెలల్లో పరుగులు చేస్తానని గ్యారంటీ ఇవ్వలేను. కానీ తిరిగి ఫామ్ అందుకోవడానికి ప్రయత్నిస్తున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ తర్వాత భారత్‌కు ఆరు నెలల పాటు టెస్టులు లేవు. దీంతో రోహిత్ మరో టెస్టు మ్యాచ్ ఆడే దాఖలాలు తక్కువే. అయితే ఫిబ్రవరిలో జరగనున్న చాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ బరిలోకి దిగనున్నాడు.