calender_icon.png 11 January, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనూ మనిషినే.. పొరపాట్లు సహజం

11-01-2025 01:59:40 AM

* రాజనీతి తెలిసిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి

* రాజకీయాల్లో రాణించడానికి డబ్బు అవసరం లేదు

* వ్యాపారవేత్త నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, జనవరి 10: ‘నేనూ మనిషినే. భగవంతుడిని కాదు కదా.. సహజంగానే నేనూ పొరపాట్లు చేశా’ అని ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాలనాపరమైన వ్యవహారాల్లో నిత్యం తలమునకలై ఉండే ప్రధాని తొలిసారి ఓ యూట్యూబ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నారు.

వ్యాపారవేత్త, జిరోదా సహ వ్యవస్థాప కుడు నిఖిల్ కామత్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. రాజకీయాలపై బలమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాజకీయాలపై ప్రధాని స్పందిస్తూ.. ‘రాజనీతి తెలిసిన వ్యక్తులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. అలాంటి వారే ప్రజలకు సేవ చేయగలుగుతారు. ఎవరైనా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలే తప్ప, సొంత పనులు నెరవేర్చుకోవడానికి కాద’న్నారు.

రాజకీయాల్లోకి రావాలంటే డబ్బు కావాలా?

రాజకీయాల్లోకి రావాలంటే చేతిలో డబ్బు ఉండాలా? అనే ప్రశ్నకు మోదీ స్పందిస్తూ.. ‘మా ఊర్లో ఒక డాక్టర్ ఉండేవారు. ఆయన మంచి కంటి వైద్య నిపుణుడు. తన దగ్గరికి వచ్చే వారితో ఆప్యాయంగా మాట్లాడేవారు. మెరుగైన వైద్యసేవలు అందించేవారు. ఆయన మంచి వక్త. ఆయనకు ఓసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని అనిపించింది.

కానీ.. ఆయన వద్ద అంతగా డబ్బు లేదు. దీంతో డాక్టర్ ఇంటింటికీ వెళ్లి రూపాయి చొప్పున విరాళం తీసుకున్నారు. అలా రూ.250 సేకరించి, ఎన్నికల్లో ఖర్చు పెట్టారు. వాటిని ఖర్చు పెట్టి ఎన్నికల్లో విజయం సాధించారు. రాజకీల్లోకి రావాలంటే ఓపిక, అంకితభావంతో పనిచేసే గుణం ఉండాలి. ఓట్ల కోసం ఏమైనా చేద్దామనే ఆలోచన ఉండొద్దు. అలా పనిచేస్తే ఎప్పటికైనా గెలుపు తథ్యమ’న్నారు.  

గాంధీ ఎప్పుడూ టోపీ ధరించలేదు..

మహాత్మాగాంధీ ఎప్పుడూ పొలిటికల్ టోపీ ధరించలేదని, కానీ.. ఆయన సిద్ధాంతాలను ప్రపంచం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుం దని ప్రధాని మోదీ కొనియాడారు. స్వతంత్ర పోరాటానికి ఎంతో మంది ప్రాతినిథ్యం వహించారన్నారు. కొందరు నూలు వస్త్రాలు ఒడికి బ్రిటీష్ పాలనపై వ్యతిరేకత వ్యక్తం చేశారని, మరికొందరు ప్రత్యక్ష పోరాటాలు చేశారని గుర్తుచేశారు. 

మోదీ చర్మ సౌందర్య రహస్యమేంటి?

వ్యాపారవేత్త నిఖిల్ కామత్ ప్రతిష్ఠాత్మకంగా ప్రధాని మోదీ పాడ్ కాస్ట్ నిర్వహిం చి, ఆ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన తర్వాత నిఖిల్ కామత్ సోదరుడు నితిన్ కామత్  సోషల్‌మీడియాలో ‘ప్రధాని మోదీ చర్మ సౌందర్య రహస్యమేం టి?’ అనే ప్రశ్న అడగడం మరచిపోయాడంటూ ఆసక్తికర పోస్ట్ చేశారు.