calender_icon.png 21 October, 2024 | 7:46 AM

రేపు హ్యుందాయ్ మోటార్ లిస్టింగ్

21-10-2024 01:45:32 AM

ముంబై, దేశంలో అతిపెద్ద ఐపీవోను గతవారం జారీచేసిన హ్యుందాయ్ మోటార్ షేర్లు అక్టోబర్ 22 మంగళవారం స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ కానున్నాయి.  హ్యుందాయ్ మోటార్ రూ.27,850 కోట్ల  మెగా ఐపీవో చివరిరోజున సంస్థాగత ఇన్వెస్టర్ల మద్దతు గట్టెక్కింది. ఈ షేర్లకు తాజాగా గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) సంకేతాల ప్రకారం దాదాపు ఫ్లాట్‌గా లిస్ట్ కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ప్రస్తుతం దీనికి గ్రే మార్కెట్లో కేవలం రూ.45 ప్రీమియం పలుకుతున్నదని, ఐపీవో ధర రూ.1,960తో పోలిస్తే రూ. 2,005 ధర వద్ద లిస్ట్ అవుతుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. హ్యుందాయ్ మోటార్ ఐపీవో పట్ల రిటైల్, హైనెట్‌వర్త్ ఇన్వెస్టర్లు పెద్దగా ఆసక్తి ప్రదర్శించలేదు. వారి విభాగం పూర్తిగా సబ్‌స్క్రయిబ్ కాలేదు. అయితే యాంకర్ ఇన్వెస్టర్లతో సహా సంస్థాగత ఇన్వెస్టర్ల ఓవర్ సబ్‌స్క్రిప్షన్‌తో ఈ ఐపీవో ప్రక్రియ పూర్తయ్యింది.

మొత్తంమీద 3 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. హ్యుందాయ్ మోటార్ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి  రూ. 8,315 కోట్లు సమీకరించింది.  దేశంలో  జారీ అయిన ఐపీవోల్లో ఇదే అతిపెద్దది.  రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూయే పెద్ద ఆఫర్‌గా ఇప్పటివరకూ గుర్తింపు ఉన్నది.

  అంతకు ముందు 2021లో పేటీఎం పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించింది. 2010లో వచ్చిన రూ.15,199 కోట్ల కోల్ ఇండియా ఐపీవో, 2008లో జారీ అయిన రిలయన్స్ పవర్ రూ. 11,563 కోట్ల ఆఫర్, 2017లో వచ్చిన రూ.11,176 కోట్ల జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవోలు భారీ ఆఫర్లుగా నమోదయ్యాయి. అలాగే భారత్ మార్కెట్లో ఆటోమొబైల్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ వచ్చి రెండు దశాబ్దాలు గడించింది.