calender_icon.png 26 October, 2024 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

హ్యుందాయ్ మోటార్ నష్టాల లిస్టింగ్

22-10-2024 11:16:49 PM

ముంబై, అక్టోబర్ 22: దేశంలో అతిపెద్ద ఐపీవోగా వచ్చిన హ్యుందాయ్ మోటార్  లిస్టింగ్ తొలిరోజునే ఇన్వెస్టర్లకు భారీ నష్టం తెచ్చిపెట్టింది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో హ్యుందాయ్ మోటార్ రూ.1,960 ఆఫర్ ధరతో పోలిస్తే 1.32 శాతం తక్కువగా రూ.1,934 వద్ద , బీఎస్‌ఈలో 1.47 శాతం తక్కువగా రూ. 1,931 వద్ద లిస్టయ్యింది.

అటుతర్వాత క్రమేపీ ఐపీవోలో పెట్టుబడి చేసిన ఇన్వెస్టర్లు నష్టాలకు విక్రయించడంతో ఎన్‌ఎస్‌ఈలో 7.16 శాతం క్షీణించి రూ.1,819 వద్ద, బీఎస్‌ఈలో 7.12 శాతం తగ్గుదలతో రూ.1,820 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 2.86 కోట్ల హ్యుందాయ్ మోటార్ షేర్లు ట్రేడయ్యాయి.

హ్యుందాయ్ మోటర్ ఫండ మెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని, దేశంలో రెండో పెద్ద వాహన ఉత్పత్తి సంస్థ అయిన ఈ కంపెనీకి దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలు ఉంటాయని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ వెల్త్ హెడ్ శివాని నయతి తెలిపారు. 

పెద్ద ఐపీవోలకు నష్టాలే..

రూ. 27,850 కోట్ల  హ్యుందాయ్ మోటార్ మెగా ఐపీవో సంస్థాగత ఇన్వెస్టర్ల మద్దతుతో 2.37 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయ్యింది. దేశంలో  జారీ అయిన ఐపీవోల్లో ఇదే అతిపెద్దది.  రెండేండ్ల క్రితం లైఫ్ ఇన్సూరెన్స్ జారీచేసిన రూ. 21,000 కోట్ల ఇష్యూయే పెద్ద ఆఫర్‌గా ఇప్పటివరకూ గుర్తింపు ఉన్నది.  అంతకు ముందు 2021లో పేటీఎం పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.18,300 కోట్లు సమీకరించింది.

2010లో వచ్చిన రూ.15,199 కోట్ల కోల్ ఇండియా ఐపీవో, 2008లో జారీ అయి న రిలయన్స్ పవర్ రూ. 11,563 కోట్ల ఆఫర్, 2017లో వచ్చిన రూ.11,176 కోట్ల జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవోలు భారీ ఆఫర్లుగా నమోదయ్యాయి. ఇప్పటివరకూ జారీ అయిన 7 పెద్ద పబ్లిక్ ఆఫర్లలో ఒక్క కోల్ ఇండియా మినహా మిగిలినవన్నీ లిస్టింగ్ సమయంలోనూ, అటుతర్వాత కొద్ది సంవత్సరాలపాటు ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనే తెచ్చిపెట్టాయి.