calender_icon.png 27 November, 2024 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణకు హ్యూందాయ్ సెంటర్

13-08-2024 01:00:55 AM

మెగా కారు టెస్టింగ్‌కు..

  1. హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్ సెంటర్ ఆధునీకరణ 
  2. సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన హెచ్‌ఎంఐఈ

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): దక్షిణకొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యూందాయ్ మోటార్స్ దాని భారతీయ విభాగమైన హ్యూందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్‌ఎంఐఈ) ద్వారా తెలంగాణలో మెగా కారు టెస్టింగ్ సెంటర్‌ను స్థాపించాలని యోచిస్తోంది. మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతోపాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం (ఈవీలతో సహా) ఉంటుంది.

అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేంద్రం పునరుద్ధరణ, ఆధునీకరణ, విస్తరణ ద్వారా హెచ్‌ఎంఐఈ భారత్ సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత ఉపాధిని కల్పించనుంది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సియోల్‌లో హ్యూందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు.

చర్చల అనంతరం హెచ్‌ఎంఐఈ ప్రతినిధులు మాట్లాడుతూ... భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని, భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ సెట్టింగ్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. అత్యాధునిక పరీక్షా సౌకర్యాలు అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు హెచ్‌ఎంఐఈ ప్రతినిధులు వెల్లడించారు. 

తెలంగాణలో పరిశ్రమల అనుకూల వాతావరణం: సీఎం

ప్రపంచ స్థాయి పరిశ్రమలు నెలకొల్పేందుకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణలో పెట్టించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. హ్యూందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ హెచ్‌ఎంఐఈ ద్వారా తెలంగాణలో కారు టెస్టింగ్ కేంద్రాన్ని నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచిస్తోందని వెల్లడించారు.

రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో ప్రగతిశీల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో వ్యాపారం చేసేందుకు హెచ్‌ఎంఐఈ వంటి అత్యుత్తమ కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. హెచ్‌ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్ సమీపంలోని సౌకర్యాలు ఇతర అనుబంధ సంస్థలు, సరఫరాదారులను ఆకర్శించే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుంది. 

సియోల్‌లో సీఎం బృందం

సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బృందం అమెరికా పర్యటన ముగించుకొని దక్షిణ కొరియాలోని సియోల్ చేరుకుంది. వివిధ సంస్థల ప్రతినిధులతో సీఎం  రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమావేశమవుతున్నారు. ఎల్‌ఎస్ (ఎల్‌జీ) గ్రూప్ చైర్మన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ కేబుల్, గ్యాస్, ఇంధన, బ్యాటరీల ఉత్పత్తిలో పెట్టుబడులపై చర్చించారు. త్వరలో తెలంగాణలో పర్యటించేందుకు ఎల్‌ఎస్ గ్రూప్ బృందం అంగీకరించింది. మరోవైపు కొరియా టెక్స్‌టైల్ పరిశ్రమ సమాఖ్యతో సీఎం రేవంత్‌రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కొరియా పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలత

వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు ఆసక్తి చూపాయి. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుపై కొరియన్ టెక్స్‌టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పలు గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

టెక్స్‌టైల్ రంగం విస్తృతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని తెలిపారు. వరంగల్ టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను వివరించారు. యంగాన్ కార్పొరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సొయంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు ఈ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.