calender_icon.png 16 November, 2024 | 10:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైసియా సాయం అభినందనీయం

09-09-2024 04:01:03 AM

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, సెప్టెంబర్ 08 (విజయ క్రాంతి): వరదల బాధితులకు నిత్యవసర సరకులు అందించేందుకు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్(హైసియా), నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థలు ముందుకురావడం అభినందనీయమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఆయా సంస్థలు అందించిన నిత్యవసర సరుకులతో కూడిన వాహనాన్ని ఆదివారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్‌తో కలిసి శ్రీధర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లోని వరద బాధితుల కోసం హైసియా, నిర్మాణ్ సంస్థలు రూ. 1 కోటి విలువైన 10 వేల నిత్యవసర సరకుల కిట్లను అందిస్తున్నాయన్నారు.

వరద బాధితులకు ప్రభుత్వంతో పాటు తాము కూడా సహాయం అందిస్తామని స్వచ్ఛందంగా కదిలి వస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. సర్వీస్‌నౌ, యూఎస్టీ, వెబ్‌పీటీ, ఇన్ఫోసిస్‌లతోపాటు ఇతర సంస్థలన్నీ కూడా కష్టాల్లో ఉన్న ప్రజలకు తమ వంతు తోడ్పాటునందించడం గొప్ప విషయమన్నారు. ఏ విపత్తు వచ్చినా ముందుకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్న నిర్మాణ్ సంస్థను మంత్రి అభినందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ... రాష్ట్రంలో అకాల ఉపద్రవంలో చిక్కుకున్న వరద బాధితులకు సాయం చేయాలనే పలు సంస్థల సంకల్పానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, హైసియా అధ్యక్షుడు ప్రశాంత్ నాదెళ్ల,  మాజీ అధ్యక్షుడు భరణీకుమార్, నిర్మాణ్ ప్రతినిధులు సంధ్యారాణి, అనురాధ, యూఎస్టీ ప్రతినిధి తిరుమల, వెబ్‌పీటీ ప్రతినిధి నాగ మల్లేశ్వర్‌రావు, సర్వీస్ నౌ ప్రతినిధి రోజా పాల్గొన్నారు.