23-04-2025 12:45:40 AM
-ఎడ్ల సుధాకర్‌రెడ్డిది కాదంటూ పిటిషన్ డిస్మిస్
- సిటీ సివిల్ కోర్టు చారిత్రక తీర్పు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 22(విజయక్రాంతి): నగరంలోని బాగ్‌అంబర్‌పేట్ బతుకమ్మకుంట విషయంలో హైడ్రా వాదనే నిజమైంది. బతుకమ్మకుంట కాదు, ఆ స్థలం తనదేనని కోర్టుకెక్కిన ఎడ్ల సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి వాదనలో నిజం లేదంటూ సిటీ సివిల్ కోర్టు తేల్చి చారిత్రక తీర్పునిచ్చింది.
ఆయన వేసిన సివిల్ సూట్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. రెవెన్యూ రికార్డులు, విలేజ్ మ్యాప్‌లు, శాటిలైట్‌ఇమేజ్‌లు, సర్వే ఆఫ్ ఇండియా రికార్డుల ఆధారంగా బతుకమ్మకుంటపై హైడ్రా తరఫున న్యాయవాదులు బలమైనవాదనలు వినిపించారు. దాదాపు నెల రోజుల పాటు సాగిన వాదోపవాదనల అనంతరం బతుకమ్మకుంటకు ప్రాణంపోస్తూ సిటీ సివిల్ కోర్టు జడ్జి ఎం వెంకటేశ్వరరావు మంగళవారం తీర్పునిచ్చారు.
దీంతో బతుకమ్మకుంట అభివృద్ధి పనులకు ఆటంకాలు తొలిగాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ తీర్పును స్వాగతించారు. నగరంలో హైడ్రా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆరు చెరువుల అభివృద్ధిలో బతుకమ్మకుంట ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న బతుకమ్మకుంట అభివృద్ధి పనులను హైడ్రా చేపట్టింది. ఆరోజు మోకాలు లోతు మట్టి తీయగానే నీటిఊట బయటకు వచ్చిన విషయం తెలిసిందే.