calender_icon.png 7 November, 2024 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు అమలు చేయలేకనే హైడ్రామా

31-08-2024 12:55:17 AM

2028లో తెలంగాణలో బీజేపీదే ప్రభుత్వం

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను వదలం

కేసీఆర్ కుటుంబాన్ని వదలిపెట్టేది లేదు

కేంద్ర మంత్రి బండి సంజయ్

నాగోల్‌లో సభ్యత్వ నమోదుపై వర్క్‌షాప్

హాజరైన ఎంపీలు ఈటల రాజేందర్, లక్ష్మణ్

ఎల్బీనగర్, ఆగస్టు 30 : ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకనే కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో హైడ్రామా ఆడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ హాల్‌లో బీజేపీ అనుబంధ సంఘాలు, మోర్చాల నాయకులతో సభ్యత్వ నమోదు వర్క్‌షాప్ నిర్వహించారు. దీనిలో కేంద్ర  మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ చెరువుల పరిరక్షణకు సహకరిస్తామని, కానీ పేదవాళ్ల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. సల్కం చెరువులో నిర్మించిన విద్యాసంస్థలపై చేయి వేస్తే సహించేది లేదని అక్బరుద్దీన్ ఒవైసీ హెచ్చరించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందని విమర్శించారు. ఓవైసీలు బెదిరిస్తే భయపడేది కేంద్ర ప్రభుత్వం కాదన్నారు. మైనార్టీలు చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవనాలను వదిలేస్తారు.. హిందువులవి కూల్చేస్తారా? అని ప్రశ్నించారు. ఓల్డ్ సిటీలో ప్రతిష్టించే ప్రతి వినాయకుడిని దర్శించుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

 కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు తేడా లేదు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు పెద్ద తేడా లేదన్నారు. వారి టార్గెట్ బీజేపీనే అని, అలాంటప్పుడు తాము వారిని వదిలేది లేదని హెచ్చరించారు. బీజేపీ ఎప్పటికీ బీఆర్‌ఎస్‌ను వదలిపెట్టదన్నారు. తనపై అక్రమంగా కేసులు పెట్టిన తీరును ఎప్పటికీ మర్చిపోనని తెలిపారు. 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమ వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పొరపాటు చేశామనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. ప్రజలు ఇప్పటికీ బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మనం ఓటు వేయించుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పేదల బతుకులు మారాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు.

కవిత బెయిల్‌తో బీజేపీకి ఏం సంబంధం..

కవితకు బెయిల్ రావడం బీజేపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులు భయపడేది కేవలం న్యాయస్థానాలకే అన్నారు. వ్యక్తులు చెబితే న్యాయస్థానం బెయి ల్ ఇస్తుందా అని ప్రశ్నించారు. ముఖ్యమైన స్థానాల్లో ఉన్నవారు న్యాయస్థానాలను అగౌరవపర్చొద్దని సూచించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాటాముచ్చట అయిపోయిందన్నారు. బీజేపీ కొట్లాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వదలిపెట్టేది లేదని, కుటుంబ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకమని సంజయ్ పేర్కొన్నారు.

బీజేపీ బలోపేతానికి కృషి: ఎంపీ లక్ష్మణ్ 

రాజ్యసభ ఎంపీ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ గత ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుని బీజేపీ బలోపేతమే లక్ష్యంగా అధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేపట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ కేవలం మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నదన్నారు. నిజమైన పేదవారికి, మైనార్టీలకు, రిజర్వేషన్ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి ఎటువంటి అభ్యంతరం లేదని అన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ రహస్య ఒప్పందంలో భాగంగానే ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిందని మాట్లాడడం  సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడొవచ్చా? అని ప్రశ్నించారు. 

నాయకుడిగా ఎదగడానికి అవకాశం: ఎంపీ ఈటల 

బీజేపీలో ఉన్నతస్థాయికి ఎదగడానికి నాయకులకు సభ్యత్వ నమోదు మంచి అవకాశమన్నారు. ప్రతి కార్యకర్త  ప్రజలతో మమేకం కావడానికి సభ్యత్వ నమోదు సువర్ణావకాశమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అధిక సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ బీజేపీ అని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధిస్తేనే బీజేపీ తెలంగాణలో బలపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ  హామీలను నేరవేర్చలేని స్థితిలో ఉందని విమర్శించారు.

అనంతరం ‘శక్తివంతమైన బీజేపీ.. అభివృద్ధి చెందిన భారత్’ అనే లోగోను ఆవిష్కరించారు.   బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో  నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు,   ప్రధాన కార్యదర్శులు గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు బంగారు శృతి, కిసాన్‌మోర్చా నాయకుడు గోలి మధుసూదన్‌రెడ్డి,  మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్,  రాష్ట్ర అధికార ప్రతినిధి మాధవి,  తదితరులు పాల్గొన్నారు.