- నిరసనలు.. నినాదాల మధ్య సాగిన సభ
- సభ పూర్తయ్యే వరకు నిలబడే ఉన్న బీఆర్‌ఎస్ మహిళా సభ్యులు
- సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై చర్చ పెట్టాలని మొండిపట్టు
- సయోధ్యకు అక్బరుద్దీన్ ఒవైసీ విఫల యత్నం
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): శాసనసభలో గురువారం హైడ్రామా కొనసాగింది. బీఆర్‌ఎస్ మహిళా సభ్యులపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు నల్ల బ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై స్పీకర్ చర్చ పెట్టాల్సిందేనని ఆ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి స్పీకర్‌ను పదే పదే కోరారు. స్పీకర్ నుంచి ఎలాంటి స్పంద న రాలేదు. అనంతరం స్పీకర్ స్పందిస్తూ.. ఎస్సీ వర్గీకరణ, స్కిల్ వర్సిటీ బిల్లుపై మాత్ర మే మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఇస్తానని తేల్చిచెప్పారు.
దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కేటీఆర్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. ‘నై చలేగా నై చలేగా... తానా షా హీ నై చలేగా’ అంటూ నినాదాలు చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్’ అంటూ నినదించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సభలో మాట్లాడుతుండగా.. వారి ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎస్సీ వర్గీకరణపై బీఆర్‌ఎస్ సభ్యులు సైతం తమ అభిప్రా యం చెప్పాల్సిన సందర్భంలో మాత్రం మహిళా ఎమ్మెల్యేలు మినహా మిగతా బీఆర్‌ఎస్ సభ్యులు తమ కుర్చీల్లో కూర్చున్నారు. అనంతరం స్పీకర్ స్పందిస్తూ.. ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎస్సీ వర్గీకరణ, స్కిల్ వర్సిటీ బిల్లుపై మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తున్నామని ప్రకటించారు. హరీశ్‌రావు తన ప్రసంగం పూర్తి చేయబోతుండగా బీఆర్‌ఎస్ సభ్యులు తిరిగి నిరసన గళం వినిపించారు.
దీంతో స్పీకర్ మైక్ కట్ చేశారు. స్పీకర్ తీరుకు నిరసనగా మహిళా ఎమ్మెల్యేలు మినహా మిగతా బీఆర్‌ఎస్ సభ్యులు మధ్యాహ్నం 12.30 గంటలకు సభ నుంచి వాకౌట్ చేశారు. వారు వెళ్లిపోయిన తర్వాత కూడా బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి సభలో నిలబడే ఉన్నారు. చివరకు సీఎం రేవంత్‌రెడ్డి తన ప్రసంగం పూర్తి చేసి సభ్యులందరూ బయటకు వెళ్లారు. ఆ తర్వా తే బీఆర్‌ఎస్ మహిళా సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు అక్బరుద్దీన్ యత్నించారు. సభలో మహిళా సభ్యులను నిలబెట్టడం మంచిది కాదని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయినా స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన లేదు.