calender_icon.png 17 January, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆక్రమణలపై హైడ్రా కొరడా

14-08-2024 12:37:14 AM

  1. ఆవిర్భవించిన నెలలోనే కార్యాచరణకు శ్రీకారం 
  2. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణే ధ్యేయం 
  3. ఆక్రమణదారులపై కేసుల నమోదు ప్రారంభం

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): నగరంలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులను ఆక్రమణలను కాపాడడమే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా.. ఆవిర్భవించి నెల రోజులు కాకుండానే రంగంలోకి దిగింది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ ఆక్రమణల చెర నుంచి ప్రభుత్వ ఆస్తులను కాపాడుతోంది. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తూ భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించాలనుకునే వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా.. అవేమీ పట్టించుకోకుండా చట్టాన్ని అమలు చేయడమే లక్ష్యంగా, భవిష్యత్తులో ఆక్రమణలు లేని హైదరాబాద్ మహా నగరాన్ని రూపొందించేందుకు హైడ్రా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. 

ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా.. 

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు దాకా విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ ఎంసీ పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ (ఈవీడీఎం)ను ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)గా మార్పు చేస్తూ జూలై 19వ తేదీన జీవో ఎంఎస్ నంబర్ 99ను విడుదల చేసింది. హైడ్రా ఆవిర్భావం కాకముందే పాత ఈవీడీఎం డైరెక్టర్ పోస్టును కమిషనర్ పోస్టుగా మార్పులు చేసింది. హైడ్రా కమిషనర్‌గా ఏవీ రంగనాథ్‌ను ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రెడ్డి స్థానంలో నియామకం చేసింది.

హైదరాబాద్ మహా నగరంలో ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడడం కోసమే ఈ వ్యవస్థను మరింత పటిష్టవంతంగా తీర్చిదిద్దుతున్నట్టు పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 185 చెరువులు, ఓఆర్‌ఆర్ పరిధిలో ఉన్న 400కు పైగా చెరువులను ఆక్రమణల చెర నుంచి కాపాడేందుకు ప్రభుత్వం స్పష్టమైన మార్గనిర్ధేశాన్ని ఈ హైడ్రాకు సూచించింది. ఇదే విషయాన్ని హైడ్రా ఏర్పాటుకు విడుదల చేసిన జీవో నంబర్ 99లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 

ఫిర్యాదులపై చర్యలు.. 

ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రాకు ప్రజల నుంచి ఫిర్యాదులు విపరీతంగా వస్తున్నాయి. ప్రతిరోజూ 40 నుంచి 50 ఫిర్యాదులను స్వీకరిస్తున్న హైడ్రా అధికారులు, ముందుగా ఆ ఫిర్యాదులను పరిశీలించి, విచారణ జరిపిన తర్వాత చర్యలకు సిద్ధమవుతున్నారు. స్వయంగా ఆక్రమణల ప్రదేశాన్ని కమిషనర్ పరిశీలించి తక్షణ చర్యలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో ఆక్రమణదారులు ఎవరని చూడకుండా.. ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టుగా రుజువులు ఉంటే చాలు తక్షణమే ఆ నిర్మాణాలను కూల్చివేసేందుకు కార్యాచరణ చేపడుతున్నారు.

ఇటీవల రాజేంద్రనగర్ శివరాంపల్లి పోలీస్ అకాడమీ సమీపంలోని 42, 50 సర్వే నంబర్లలో బూమ్‌రుఖా ఉద్ దవాళ్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసి 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడారు. అదే రోజు చందానగర్ ఈర్ల చెరువులో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేయడంతో పాటు నందగిరి హిల్స్ ప్రాంతంలోని పార్కు స్థలంలో ఏర్పాటు చేసుకున్న నివాసాలను తొలగించారు.

ఈ సమయంలో పలువురు ప్రజా ప్రతినిధులు సిపార్సుల కోసం ఫోన్లు చేస్తున్నా ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝులిపించడంపై నగర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆక్రమణదారులకు అండగా ఉంటున్నా.. పరోక్షంగా ప్రోత్సహించే వ్యక్తులు ఎలాంటి వారైనా సరే వారిపై చర్యలకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బంజారాహిల్స్ పోలీసులకు హైడ్రా ఫిర్యాదు చేయడం విశేషం. భవిష్యత్తులో రాజకీయ ఒత్తిళ్లను హైడ్రా అధికారులు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సి ఉంది.