calender_icon.png 17 October, 2024 | 5:02 AM

బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రా

17-10-2024 02:39:16 AM

ప్రభుత్వ మోసాన్ని ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం

50 ఏండ్ల పర్మిషన్లు.. ఇప్పడు కూల్చివేతలా!

హైదరాబాద్‌లోని పేదలకు రక్షణగా ఉంటాం 

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 16(విజయక్రాంతి): హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని సృష్టించిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బిల్డర్లను బెదిరించేందుకే హైడ్రాను ఉపయోగిస్తున్నారన్నారు. మూసీ పేరిట ప్రభుత్వం ఎలా లూటీ చేస్తుం దో వివరించేందుకు ప్రజల్లోకి వెళ్తామని, ఈ మేరకు త్వరలోనే షెడ్యూల్‌ను ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో సిటీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల హైదరాబాద్‌లో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 50 ఏండ్ల క్రితమే ప్రభుత్వం పర్మిష న్లు ఇచ్చిన బిల్డింగ్‌లను ఇప్పుడు కూలగొడతామంటే ఊరుకునేది లేదన్నారు.

బీఆర్‌ఎస్ హయంలో సుధీర్ రెడ్డి చైర్మన్‌గా ఉన్నప్పుడే మూసీ సుందరీకరణ చేపట్టాలని అనుకున్నామని.. కానీ గరీబోళ్లకు అన్యాయం జరు గుతుందన్న ఉద్దేశంతోనే కేసీఆర్ వద్దని చెప్పారన్నారు. హైదరాబాద్‌లోని పేదలకు బీఆర్‌ఎస్ రక్షణగా ఉంటుందని స్పష్టం చేశా రు. హైడ్రా పేరుతో సర్కారు భయపెడుతు న్న అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు ధైర్యాన్ని ఇస్తామన్నారు.

అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లు ఓవర్లు కట్టాలని తమ హయాంలో అనుకున్నామని, కానీ పర్యావరణం దెబ్బతింటుందంటే ఆ ప్రతిపాద నలను విరమించుకున్నామని చెప్పారు. 2017లో రాడార్ నిర్మాణానికి జీవో ఇచ్చినప్పటికీ పర్యావరణం దెబ్బతింటుందనే ఆ జీవోను నిలిపిఉంచామన్నారు.

కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ సర్కారు మొత్తం అప్పులు రూ.80,500 కోట్లు అప్పులు చేసిందని విమర్శించారు. ఆనాడు అప్పు- తప్పు అన్నోళ్లని.. ఇప్పుడు దేనితో కొట్టాలని ప్రశ్నించారు.

ఎన్నికల హామీలను తీర్చకుండా, ఏ కొత్త సాగునీటి ప్రాజెక్టు కట్టకుండా, తెస్తున్న అప్పు ఏమైనట్టు? రూ.80 వేల కోట్ల రుణం ఎవరి జేబులోకి వెళ్లినట్టు? అని సీఎంను ప్రశ్నించారు. పెళ్లిళ్ల సీజన్ వచ్చిందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సర్కార్ చెప్పిన తులం బంగారం హామీ ఏమైందని సీఎం రేవంత్‌కు  కేటీఆర్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. తులం బంగారం ఈసారి కూడా ఉత్తమాటేనా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం..

ప్రభుత్వం మెడలు వంచైనా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించేలా ఒత్తిడి తెస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజేస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ కేటీఆర్‌ను తెలంగాణ భవన్‌లో కలిసింది. ఈ సందర్భంగా కేటీఆర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు.

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్‌లకు ప్రభుత్వం తక్షణమే రూ.650 కోట్ల రూపాయలు చెల్లిస్తే తమ సమస్య చాలా వరకు తీరుతుందని కేటీఆర్‌కు చెప్పారు. కేటీఆర్‌ను కలిసినవారిలో తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు బొజ్జ సూర్యనారాయణరెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ యాద రామకృష్ణ సహా అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.