- సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీకి గులాంలు
- బీజేపీ రాజ్యసభ ఎంపీ కే లక్ష్మణ్
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): ఆరు గ్యారంటీలు, హామీలను పక్కదారి పట్టించడానికే హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. పార్టీ స్టేట్ ఆఫీసులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హైడ్రాకు అధికారాలు చట్టబద్ధత కల్పించలేదని తెలిపారు. ప్రతిరోజు వార్తల్లో నిలవాలని హైడ్రా పేరిట హడావుడి చేస్తున్నారని, డైవర్ట్ పాలిటిక్స్‌కు తెరదీశారని అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఢిల్లీ నాయకులకు గులాంలుగా మారిపోయారని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి పరుగులు పెట్టడం తప్పితే ప్రజలకు ఏమీ చేయడం లేదని మండిపడ్డారు.గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తున్నా కాంగ్రెస్ నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. డెంగ్యూ జ్వరాలతో ఆసుపత్రులు నిండిపోయినా చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫిరాయింపులపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని లక్ష్మణ్ తెలిపారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. రైతుల పాలిట కాంగ్రెస్ భస్మాసుర హస్తంగా మారిందన్నారు. రుణమాఫీ కాక మేడ్చల్‌లో వ్యవసాయశాఖ కార్యాలయం ఎదుట పాస్ బుక్ పైనే సూసైడ్ నోట్ రాసి రైతు సురేందర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. రాష్ర్టంలో టీచర్ల కొరత కారణంగా 1800 స్కూల్స్ మూతపడ్డాయని తెలిపారు. ఇప్పటికైనా హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు.