calender_icon.png 22 September, 2024 | 3:05 AM

మూసీ ఆక్రమణలపై హైడ్రా గురి

22-09-2024 01:03:49 AM

నేటి నుంచి కూల్చివేతలు? 

55 కిలోమీటర్ల మేర 12 వేలకు పైగా ఆక్రమణలు గుర్తింపు 

బాధితులకు పునరావాసం కల్పించేందుకు నిర్ణయం

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడిన వారిపై హైడ్రా ఉక్కుపాదం మోపుతూ కూల్చివేతలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఆక్రమణ దారుల్లో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నందున హైడ్రా ప్రతిరోజూ పతాక శీర్షికల్లో నిలుస్తోంది.

ఈ క్రమంలోనే హైడ్రాకు చట్టబద్ధత లేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో హైడ్రాకు విశేషాధికారాలు కల్పించేందుకు శుక్రవారం క్యాబినెట్ ఆమోదించడం తో విమర్శకులందరికీ సమాధానం గా నిలిచింది. అయితే, ప్రభుత్వంఅత్యంత ప్రతిష్టాత్మ కంగా చేపడుతున్న మూసీ ప్రకాళన, సుందరీకరణ పనుల్లో భాగంగా పరీవాహక ప్రాంతం లోని ఆక్రమణలను తొలగించే బాధ్యతను హైడ్రాకు అప్పగించారు. ఈ క్రమంలో మూసీ పరీవాహక ప్రాంతం వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా గుర్తించిన ఆక్రమణలను నేటి(ఆదివారం) నుంచి కూల్చేందుకు హైడ్రా సిద్ధమవుతున్నట్లు సమాచారం. 

12 వేల ఆక్రమణలు గుర్తింపు.. 

హైదరాబాద్‌లోని మూసీ పరీవాహక ప్రాంతాన్ని వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా దాదాపు 55 కిలోమీటర్ల మేర ప్రక్షాళన చేసి, సుందరీకరణ చేసే పనులు ఒక్కొక్కటిగా వేగవంతం అవుతున్నాయి. మూసీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం దశలవారీగా టార్గెట్‌లను పూర్తి చేస్తోంది. ఈ క్రమంలో వెస్ట్ నుంచి ఈస్ట్ దాకా (గండిపేట్ నుంచి ఘట్‌కేసర్ వరకు) 110 చదరపు కిలోమీటర్ల వ్యాప్తంగా మూసీ పరీవాహక ప్రాంతాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దడమే కాకుం డా, మూసీని టూరిజం హబ్‌గా తయారు చేయడానికి అనేక కమర్షియల్, పబ్లిక్ కారిడార్‌లను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 

అందు లో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతంలో బఫర్ జోన్ల పరిధిలో ఉన్న నిర్మాణాలలో ఉంటున్న వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు జూలై నుంచి ఆగ స్టు దాకా 33 రెవెన్యూ బృందాల ఆధ్వర్యం లో ప్రత్యేక సర్వే చేశారు. ఈ సంద ర్భంగా పరీవాహక ప్రాంతంలో దాదాపు 12 వేలకు పైగా ఆక్రమణలు ఉన్నట్టుగా రెవె న్యూ బృం దాలు గుర్తించాయి. వీటిలో నది గర్భంలో 2 వేలు, ఎఫ్‌టీఎల్ పరిధిలో 3 వేలు, బఫర్ జోన్ పరిధిలో 7 వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్టుగా అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో పునరావాసం కింద వారికి డబుల్ ఇళ్లను గుర్తించే పనిలో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  వారికి 3,560 డబుల్ ఇళ్లు అవసరం అని అధికారులు గుర్తించారు.  

ముందుగా నది మధ్య భాగం వరకు..

మూసీ పరీవాహక ప్రాంతంలో గుర్తించిన 12 వేల ఆక్రమణలను కూల్చివేసే బాధ్యతను ప్రభుత్వం హైడ్రాకు అప్పజెప్పింది. ముందుగా నది మధ్య భాగం వరకు చేపట్టిన నిర్మాణాలను కూల్చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత బాధితులకు డబుల్ ఇళ్లలో పునరావాసం కల్పించిన అనంతరం మిగతా ఇళ్లను కూడా కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. బాధితులకు పునరావాసం కల్పించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం నగరంలో పలు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించారు.