calender_icon.png 22 September, 2024 | 5:53 PM

కూల్చివేతలపై హైడ్రా కీలక ప్రకటన విడుదల

22-09-2024 03:26:56 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాలను నేలకూలుస్తున్న హైడ్రా రాష్ట్రవ్యాప్తంగా చెరువుల్లో భారీ అక్రమ నిర్మాణాలను గుర్తించి ఉక్కుపాదం మోపుతోన్న విషయం తెలిసిందే. హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కూకట్ పల్లి నల్లచెరువులోని సర్వే నంబర్ 66, 67, 68, 69లోని 16 వాణిజ్య షెడ్లు, ప్రహరీ గోడలను, అనధికార షెడ్లను కూల్చివేశామని హైడ్రా వెల్లడించింది. కూకట్ పల్లి నల్లచెరువు పరిధిలోని 4 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ మండలంలో ఆక్రమణలను కూల్చివేశామని, ప్రభుత్వ స్థలంలో నిర్మించిన భవనాలను కూల్చివేసినట్లు ప్రకటనలో హైడ్రా అధికారులు చెప్పారు.

కృష్టారెడ్డిపేటలోని సర్వే నంబర్ 164లో 3 భవనాలు, వాణిజ్యపరంగా వినియోగిస్తున్న ఐదంతస్తుల భవనాన్ని హైడ్రా నేలమట్టం చేసి, కృష్టారెడ్డిపేటలో ఒక ఎకరం ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకుంది.  పటేల్ గూడలోని సర్వేనంబర్ 12/2, 12/3లో 25 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి. 3 ఎకరాలు, మరో 3 ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. వ్యాపారం కోసం నిర్మించిన భవనాలను మాత్రమే కూల్చివేశామని హైడ్రా అధికారులు వెల్లడించారు.